చానల్ కార్యాలయంపై రాళ్లతో దాడి
ABN , First Publish Date - 2020-09-20T09:52:06+05:30 IST
ఓ చానల్ కార్యాల యంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు...

బంజారాహిల్స్, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): ఓ చానల్ కార్యాల యంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం... జూబ్లీహిల్స్‌లోని టీటీడీ దేవాలయం ఎదురుగా ఉన్న ఎన్టీవీ కార్యాలయం వద్దకు శుక్రవారం అర్ధరాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు మొదటి, రెండో అంతస్తుల వరకు రాళ్లు విసిరారు. ఫ్రంట్ ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డు నల్లప్పపై దుండగుల్లో ఒకరు రాడ్లతో దాడికి యత్నించారు. ఉద్దేశపూర్వకంగానే తమ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చానల్ సీఈఓ రాజశేఖర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారని అదృష్టవశాత్తు వారు తప్పించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయారని తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 148, 427, 452, 506 రెడ్ విత్149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.