హైడ్రాలిక్ కార్గో వాహనం ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-03T09:32:55+05:30 IST
వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్ల వద్ద భారీ క్లోరిన్ సిలిండర్లను చేరవేసి అమర్చేందుకు ప్రత్యేక హైడ్రాలిక్ కార్గో వాహనాలను వాటర్‌బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 11 టన్నుల సామర్థ్యం
రిజర్వాయర్ల వద్ద క్లోరిన్ సిలిండర్లను అమర్చేందుకు..
హైదరాబాద్ సిటీ, నవంబర్ 2 (ఆంధ్రజ్యోతి): వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్ల వద్ద భారీ క్లోరిన్ సిలిండర్లను చేరవేసి అమర్చేందుకు ప్రత్యేక హైడ్రాలిక్ కార్గో వాహనాలను వాటర్‌బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 11 టన్నుల సామర్థ్యం గల ఈ కార్గో వాహనానికి హైడ్రాలిక్ క్రేన్ అమర్చడంతో భారీ క్లోరిన్ సిలిండర్లను వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఇతర రిజర్వాయర్ల వద్ద లోడింగ్, రవాణా, అన్‌లోడింగ్ చేసే ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. గతంలో ఈ ప్రక్రియను కార్మికులతో పూర్తి చేసేవారు. ఈ వాహనానికి అమర్చిన హైడ్రాలిక్ కార్గో క్రేన్ మొత్తం 2.5 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల బరువును ఎత్తగలదు. వాహనం వెయ్యి కిలోల సామర్థ్యం గల మూడు భారీ క్లోరిన్ సిలిండర్లతోపాటు మరో 100 కిలోల క్లోరిన్ సిలిండర్లను చేరవేస్తుంది. వాటర్‌బోర్డు మంచినీటి సరఫరా చేసే పరిధి ఓఆర్‌ఆర్ గ్రామాల వరకు విస్తరించి రిజర్వాయర్ల సంఖ్య పెరగడంతో భారీ క్లోరిన్ సిలిండర్లను త్వరగా, సురక్షితంగా పంపిణీ చేయడానికి ఈ కార్గో వాహనాలతో వీలవుతుంది. 3 హైడ్రాలిక్ క్రేన్ అమర్చిన కార్గో వాహనాలు సైనిక్‌పురి, లింగంపల్లి, సాహెబ్‌నగర్ రిజర్వాయర్ల ప్రాంగణాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ వాహనాలను సోమవారం వాటర్‌బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ ఖైరతాబాద్ వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీధర్‌బాబు, టెక్నికల్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్‌తోపాటు సీజీఎం విజయరావు, క్యూఏటీ జిమ్ డీజీఎం పాల్గొన్నారు.