గెలిచినా..ఓడినా కాంగ్రెస్‌లోనే ఉంటా: శ్రీనివాస్ రెడ్డి
ABN , First Publish Date - 2020-11-03T16:58:32+05:30 IST
తాను కాంగ్రెస్‌ను వీడే ప్రశ్నేలేదని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి చెప్పారు.
హైదరాబాద్: తాను కాంగ్రెస్‌ను వీడే ప్రశ్నేలేదని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి చెప్పారు. తాను టీఆర్ఎస్‌లో చేరినట్లు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో ఎప్పటికీ చేరనని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గెలిచినా.. ఓడినా కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు.
బీజేపీ నేత రఘునందన్‌రావు, మంత్రి హరీష్ రావు కలిసి ఓటమి భయంతో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, ఇది సిగ్గుమాలిన చర్యంటూ శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఫేక్ న్యూస్‌ను ప్రజలు నమ్మవద్దని కోరారు. చిన్న గొడవ జరిగితే గత రాత్రి 2 గంటల వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నానని, తన వెనుక పోలీస్ షాడో టీమ్ కూడా ఉందని ఆయన చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్నాయన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తన తండ్రిపై ప్రమాణం చేసి ప్రతి గ్రామంలో చెప్పానని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.