సోషల్‌మీడియాతో జాగ్రత్త

ABN , First Publish Date - 2020-02-16T08:29:39+05:30 IST

సాంకేతికత పుణ్యమాని అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ల రాకతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది.

సోషల్‌మీడియాతో జాగ్రత్త

పర్సనల్‌ సమాచారం బయటపెట్టొద్దు  

సైబర్‌ నేరగాళ్ల బారిన పడొద్దు  

డీసీపీ రోహిణి ప్రియదర్శిని


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): సాంకేతికత పుణ్యమాని అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ల రాకతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. నెట్టింట్లో పెట్టిన సమాచారం క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడికెక్కడికో వెళ్లిపోతోంది. మరో పక్క ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల వంటి సోషల్‌ మీడియాకు యువత బానిసలుగా మారుతున్నారు. లైక్‌ల కోసం,  కామెంట ్లకోసం వ్యక్తిగత ఫొటోలు, సమాచారం పోస్టు చేస్తున్నారు. ముక్కు ముఖం తెలియని వారి రిక్వెస్టులను స్వీకరించి ఆ తర్వాత సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతున్నారు. మృగాళ్ల లైంగిక వేధింపులకు బలవుతున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న నేరగాళ్లు అనేక రకాల సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో అందుబాటులో ఉన్న సెట్టింగ్స్‌ను యువత ఉపయోగించాలని డీసీపీ (క్రైమ్‌) రోహిణి ప్రియదర్శిని సూచించారు. వ్యక్తిగత సమాచారం బయట పెట్టొద్దని, సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆమె ఏమంటున్నారంటే.. 


సెట్టింగ్స్‌ కీలకం...

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్‌మీడియా యాప్‌లను ఉపయోగించేటప్పుడు అందులోని సెట్టింగ్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. పోస్టు చేసిన సమాచారం అందరూ చూసేవిధంగా (పబ్లిక్‌) పెట్టకుండా కేవలం ఖాతాదారులకు మాత్రమే కనిపించేలా, దగ్గరి స్నేహితులు, నమ్మకస్తులకు మాత్రమే వెళ్లేలా మార్పులు చేసుకోవాలి. దాని వల్ల మన సమాచారం పబ్లిక్‌లోకి వెళ్లకుండా నిరోధించుకోవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు ఇలాంటి సెట్టింగ్స్‌ను ఉపయోగించాలి. 


ఫేసుబుక్‌లో అకౌంట్‌ సెట్టింగ్‌లోకి వెళ్లి ప్రైవసీ సెట్టింగ్‌ షాట్‌కట్స్‌ క్లిక్‌ చేయాలి. అందులో  ‘యువర్‌ యాక్టివిటీస్‌’, ‘హవ్‌ పీపుల్‌ ఫైన్డ్‌ కాంటాక్టు యూ’ ‘స్టే సేఫ్‌ అండ్‌ సెక్యూరిటీ’ అనే సెట్టింగ్‌ అండ్‌ టూల్స్‌ కనిపిస్తాయి. వాటిలో ఫేస్‌బుక్‌ పోస్టుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంచుకోవాల్సిన సెట్టింగ్స్‌ అన్ని వివరంగా ఉంటాయి. చాలామంది యువత వాటిపై దృష్టిపెట్టకుండా వ్యక్తిగత సమాచారం అంతా పోస్టు చేసి పబ్లిక్‌లో పెడుతున్నారు. అపరిచిత వ్యక్తుల ఫ్రెండ్‌ రిక్వెస్టులను యాక్సెఫ్ట్‌ చేసి, ఆ తర్వాత వారిని ఎలా బ్లాక్‌ చేయాలో తెలియక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారు పెట్టిన అసభ్య మెసేజ్‌లు, అశ్లీల చిత్రాలకు భయపడిపోయి జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. సెట్టింగ్‌లోకి వెళ్లి అన్‌ఫ్రెండింగ్‌ అండ్‌ బ్లాకింగ్‌ ద్వారా అలాంటి చెక్‌ పెట్టవచ్చు. లెర్న్‌ అబౌట్‌ యువర్‌ ప్రైవసీ ఆన్‌ ఫేస్‌బుక్‌ టూల్స్‌లోకి వెళ్తే కొత్త కొత్త సెట్టింగ్స్‌ అందుబాటులో ఉంటాయి.


వాటిపై అవగాహన పెంచుకొని సోషల్‌మీడియాను వినియోగిస్తే మంచిది. ఇటీవల చనిపోయిన ఐటీ ఉద్యోగుల పేరుతో బ్యాంకు రుణాలు తీసుకొని రూ. 53లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు.. చనిపోయిన వ్యక్తుల ఫేస్‌బుక్‌ ఖాతా నుంచే అధిక సమాచారం సేకరించినట్లు విచారణలో తేలిందని ఈ సందర్భంగా డీసీపీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. సదరు వ్యక్తి ఫొటోలు, ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీలను సేకరించి నకిలీ పత్రాలతో బ్యాంకు అధికారులను మోసగించి, రుణాల పేరుతో లక్షలు కొల్లగొట్టిన విషయం గుర్తించాలన్నారు.  

Updated Date - 2020-02-16T08:29:39+05:30 IST