స్మార్టుఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోనే కాలక్షేపం

ABN , First Publish Date - 2020-03-13T09:32:31+05:30 IST

‘జో అచ్చుతానందా.. జోజోముకుందా... రావె పరమానంద రామా గోవిందా... జో.. జో’ అంటూ అప్పట్లో పిల్లలు నిద్రపోకపోతే జోలపాట పాడి పడుకోబెట్టేవారు.

స్మార్టుఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోనే కాలక్షేపం

నిద్రపోరా తమ్ముడా...!!

తగ్గిపోయిన నిద్ర గంటలు

తేల్చిన ఓ సంస్థ సర్వే

నేడు వరల్డ్‌ స్లీప్‌ డే


హైదరాబాద్‌ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ‘జో అచ్చుతానందా.. జోజోముకుందా... రావె పరమానంద రామా గోవిందా... జో.. జో’ అంటూ అప్పట్లో పిల్లలు నిద్రపోకపోతే జోలపాట పాడి పడుకోబెట్టేవారు. పెద్దవాళ్లయితే పాలు తాగి నిద్రకు ఉపక్రమించే వారు. పుస్తకాలు చదువుకుంటూ అలా నిద్రలోకి జారుకునేవారు. ఇదంతా గతం. ఇప్పుడు నిద్రను మరిచిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు రావడంతో నిద్రకు దూరమవుతున్నారు. ఎక్కువ మందికి మంచి నిద్ర, గాఢమైన నిద్ర లేక చాలా రోజులైంది. అర్ధరాత్రి వరకు నిద్రపోకపోవడం, పోయినా మగత నిద్ర పోవడం వల్ల నిద్రలేమి సమస్య ఒక సవాల్‌గా మారింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, టీవీలు వచ్చేసి నిద్రకు దూరం చేశాయి. గంటల తరబడి వీటితో గడపంతో నిద్ర వస్తున్నప్పటికీ ఆపుకుంటున్నారు. అర్ధరాత్రి రెండు గంటలు దాటుతున్నా సెల్‌కబ్లురు, వాట్సాప్‌, షేస్‌బుక్‌తోనే కాలక్షేపం చేసే వారే అధికంగా ఉన్నారు.


ఇకటీవీకి అతుక్కుపోయి ఉండే వారు ఇంకెందరో. ల్యాబ్‌టాప్‌తో కుస్తీలు పడేవారి పరిస్థితి చెప్పనక్కరలేదు. 10 ఏళ్ల వయస్సు నుంచి 70 ఏళ్ల వయస్సు వారు కూడా నిద్ర పోకుండా వివిధ ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. నిద్ర వేళలు మారిపోయాయి. రాత్రి పగలుగా, పగలు రాత్రిగా అవుతున్నాయి. రాత్రి పూట సరిగ్గా పడుకోలేని వారు ఉదయం, మధ్యాహ్న పూట పడుకుంటున్నారు. ఉదయం పనిచేయాల్సిన వారు రాత్రి పూట పనిచేస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు. వెరసి జనం నిద్రలేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. హైదరాబాద్‌ నగర వాసులు 41 శాతం మంది సరిగ్గా నిద్రపోవడం లేదని ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశంలోని పది నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఈ నగరాల్లో చాలా మందిలో నిద్ర తగ్గిపోయిందని సర్వేలో తేలింది. 2018లో వారం రోజుల్లో 7.66 గంటలు నిద్రపోగా తరువాత రోజుల్లో ఆ గంటలు 6.85కి తగ్గింది. వారం రోజుల్లో సగటున 2018లో 7.48 గంటలు ఉండగా తరువాత 6.76 గంటలకు తగ్గింది. 


హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లో నిద్రలేమితో అనేక మంది అవస్థ పడుతున్నారు. 2018లో ఒక శాతం ఉండగా 2019 నాటికి 21 శాతానికి చేరింది. నిద్రలేమి కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు 41 శాతం మంది హైదరాబాదీలు విశ్రాంతి లేకుండా చికాకుగా గడుపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. నగరంలో వారాంతపు రోజుల్లో నిద్ర గణనీయంగా 5.08 గంటలకు తగ్గిపోయినట్లు సర్వేలో వెల్లడైంది. ఇంతకు ముందు వారాంతంలో నిద్ర 7.88 గంటలు ఉండగా అది 5.08 గంటలకు తగ్గిపోయింది. వారం రోజుల్లో సగటున 8.13 గంటలు నిద్రపోగా అది కాస్తా 6.88కి తగ్గిపోయింది. చాలా మంది ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్లతో గడుపుతున్నారు. బెడ్‌పై పడుకున్న తరువాత 51 శాతం మంది స్మార్ట్‌ఫోన్లతో నిద్రపోకుండా ఉంటున్నారు. వారంలో మూడు రోజులు మాత్రమే 61 శాతం మంది నిద్రపోతున్నట్లు ఈ సర్వే ద్వారా గుర్తించారు. ల్యాప్‌టాప్‌లలో నిరంతరం పనిచేస్తున్నారు.  


నిద్ర గంటలు తగ్గిన నగరాలు... 

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పుణె, కొచ్చి, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, ఇండోర్‌, విశాఖపట్నం, రాయపూర్‌తో సహా పది నగరాల్లో సెంచరీ మెట్రెస్‌, వేవ్‌మేకర్‌ సంస్థలు సర్వే నిర్వహించాయి. పది నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో చాలా నగరాల్లో సగటు గంటలు కూడా ప్రజలు నిద్ర పోవడం లేదని తేలింది. చాలా మంది ఎనిమిది గంటలు నిద్రపోవడం లేదన్నది వాస్తవమని ఆరోగ్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.  


యువతలో తగ్గిన నిద్ర...

25 నుంచి 35 ఏళ్ల లోపు యువత నిద్ర వారాంతంలో 2018లో 7.70 గంటలు ఉండగా.. 2019లో 6.60 గంటలకు తగ్గింది. సర్వేలో అధిక  ఆదాయ వర్గాల్లో గతంలో కంటే నిద్ర తగ్గిపోయిందని తేలింది. గతంలో వారాంతాల్లో 6.74 గంటలు నిద్ర ఉండగా ఇప్పుడు 6.75 గంటలకు తగ్గినట్లు పేర్కొంది. మధ్య ఆదాయం ఉన్న వారి విషయంలో గతంలో  వారాంతాల్లో 7.46 గంటలు నిద్ర ఉండగా 2019లో వారం రోజులలో సగటున  6.84 గంటలకు తగ్గింది. 


నిద్ర లేక వెన్ను నొప్పి...

సరైన నిద్ర లేకపోవడం వల్ల 42 శాతం మంది వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు ఆ సంస్థ గుర్తించింది. ఈ సమస్య 2018లో 39 ఉండగా, 2019లో మూడు శాతం పెరిగింది. మంచి నిద్ర లేని కారణంగా ప్రతి ఐదుగురిలో నిద్రలేచిన తరువాత అలసట, చిరాకుగా ఉంటున్నట్లు ఈ సర్వే ద్వారా తేలిందన్నారు. నిద్ర ప్రాథమికంగా చాలా ముఖ్యమన్న విషయాన్ని ప్రజలు మరిచిపోయారని సెంచరీ మెట్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మిస్టర్‌ ఉత్తమ్‌ మాలనీ పేర్కొన్నారు. చాలా మంది సుఖ నిద్రను కోల్పోతున్నారని తెలిపారు. 


సుఖ నిద్రకు ఇలా చేయాలి...డాక్టర్‌ వీవీ రమణ ప్రసాద్‌, పల్మనాలజిస్టు, కిమ్స్‌ ఆస్పత్రి

నిద్రపోవడానికి, మేల్కొనడానికి పెద్దలు కచ్చితమైన సమయాన్ని పాటించాలి. పగటి నిద్ర 45 నిమిషాల కంటే మించకూడదు. నిద్రపోవడానికి నాలుగు గంటల ముందు అధికంగా మద్యం తీసుకోవడం, ధూమపానం చేయవద్దు. ఎక్కువగా కారం, చక్కెర ఉన్న ఆహారం తీసుకోవద్దు. నిద్రకు ఆరు గంటల ముందు టిఫిన్‌, కాఫీ, టీలు, సోడాలు తాగవద్దు. చాక్లెట్‌ తినొద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బాగా వెంటిలేషన్‌, తగిన ఉష్ణోగ్రత ఉన్న గదుల్లో నిద్రపోవాలి. నిద్రకు ఎక్కువ శబ్దం, కాంతి లేని ప్రాంతాలను ఎన్నుకోవాలి. పిల్లలను రాత్రి 9 గంటల లోపే నిద్ర పోయేటట్లు చూడాలి. పిల్లల పడక గది నిద్రకు అనుకూలంగా ఉంచాలి. నిద్రకు ముందు పిల్లలకు ఎక్కువ మోతాదులో ఆహారం ఇవ్వొద్దు. 


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో 13 శాతం... డాక్టర్‌ శ్రీనివాస్‌ కిషోర్‌, ఈఎన్‌టీ నిపుణులు, స్టార్‌ ఆస్పత్రి

హైదరాబాద్‌లోని కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో మేము ఒక సర్వే చేశాం. దాదాపు 500 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల నిద్ర పరిస్థితులపై అంచనా వేయగా అందులో 13 శాతం మంది సరిగ్గా నిద్రపోవడం లేదని తేలింది. ఇందులో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. నలుగురు పురుషులు ఉంటే ఇద్దరు మహిళలు ఉంటున్నట్లు గుర్తించాం. ఎక్కువగా రాత్రి నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి, టార్గెట్‌, మానసిక ఆందోళన, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్ల వినియోగం వల్ల వారు నిద్రకు దూరమైనట్లు గుర్తించాం. నిద్ర చాలా ముఖ్యమైనది. సరైన నిద్ర లేకపోతే ఇమ్యూనిటీ తగ్గుతుంది. ముఖం మీద మడతలు పడడం, చురుకుదనం కోల్పోపోవడం, జట్టు రాలడం, చిన్న వయస్సులోనే పెద్ద వయస్సు వారిలా కనిపించే అవకాశముంది. 50 ఏళ్లు వచ్చేసరికి నిద్రలేమి కారణంగా 70 ఏళ్ల వారిలా కనిపిస్తారు. మెదడులో చురుకుదనం లోపించడం, అన్ని విషయాలు మరిచిపోవడం వంటివి చోటుచేసుకుంటాయి. ప్రతి ఒక్కరూ 7 నుంచి 8 గంటల పాటు గాఢ నిద్రపోవాలి. మధ్యలో నిద్రకు భంగం కలగకుండా చూసుకోవాలి.  


Updated Date - 2020-03-13T09:32:31+05:30 IST