ఉప్పల్‌ జంక్షన్‌లో స్కై వాక్‌..!

ABN , First Publish Date - 2020-07-28T17:11:46+05:30 IST

ఉప్పల్‌ జంక్షన్‌లో స్కై వాక్‌ అందుబాటులోకి రానుంది. నాలుగు రహదారులను కలుపుతూ పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు వీలుగా స్కై వాక్‌ను నిర్మించే ప్రతిపాదనకు పురపాలక శాఖ పాలనాపరమైన ఆమోదం తెలిపింది. 660 మీటర్ల జంక్షన్‌

ఉప్పల్‌ జంక్షన్‌లో స్కై వాక్‌..!

పాలనాపరమైన అనుమతులిచ్చిన పురపాలక శాఖ


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌ జంక్షన్‌లో స్కై వాక్‌ అందుబాటులోకి రానుంది. నాలుగు రహదారులను కలుపుతూ పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు వీలుగా స్కై వాక్‌ను నిర్మించే ప్రతిపాదనకు పురపాలక శాఖ పాలనాపరమైన ఆమోదం తెలిపింది. 660 మీటర్ల జంక్షన్‌ చుట్టూ నిర్మించే స్కై వాక్‌ పనులను హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టనుంది. త్వరలో బిడ్‌ ఆహ్వానిస్తామని, యేడాదిలో పూర్తి చేయాలన్నది లక్ష్యమని  పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. వరంగల్‌-హైదరాబాద్‌, సికింద్రాబాద్‌- ఎల్‌బీనగర్‌ ప్రధాన రహదారులు కలిసే చోట ఉన్న ఈ జంక్షన్‌లో నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చౌరస్తాలో రోడ్డు దాటే క్రమంలో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. 


రోడ్లపై వాహనాల రద్దీ నేపథ్యంలో రోడ్డు దాటేందుకు చాలాసేపు వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్కైవాక్‌ నిర్మించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. జంక్షన్‌ మీదుగా మెట్రో కారిడార్‌ అందుబాటులోకి రాగా, రామంతాపూర్‌ వైపు నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌ను కలుపుతూ స్కై వాక్‌ నిర్మించనున్నట్టు అర్వింద్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-07-28T17:11:46+05:30 IST