రైల్వే ట్రాక్ వద్దకు పిలిపించి యువకుడి హత్య.. ఆరుగురు అరెస్ట్..
ABN , First Publish Date - 2020-08-11T14:28:15+05:30 IST
యువకుడి హత్య కేసులో ఆరుగురు నిందితులను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో సుల్తాన్‌బజార్ డివిజన్ ఏసీపీ దేవేందర్ వివరాలు వెల్లడించారు.

యువకుడిని హత్య చేసిన ఆరుగురి అరెస్టు
చాదర్‌ఘాట్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): యువకుడి హత్య కేసులో ఆరుగురు నిందితులను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో సుల్తాన్‌బజార్ డివిజన్ ఏసీపీ దేవేందర్ వివరాలు వెల్లడించారు. మూసానగర్ నివాసి సయ్యద్ సాజిద్ అలియాస్ చాచా(25), చంచల్‌గూడ నివాసులు అబ్దుల్ ఖాదర్(21), మహ్మద్ ఫయాజ్ ఉద్దీన్(23), షేక్ జమీర్(27), మహ్మద్ సైఫ్(18), మహ్మద్ సల్మాన్‌ఖాన్(30) స్నేహితులు. వీరంతా శుభకార్యాల్లో మర్ఫా బ్యాండ్ వాయిస్తారు. మత్తు కోసం గంజాయి, వైట్నర్ సేవిస్తారు. సయ్యద్ సాజిద్ చాదర్‌ఘాట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో పాత నేరస్థుడు. జేబు దొంగతనాలు, మొబైల్ ఫోన్లను దొంగిలించడంతోపాటు పలు నేరాలతో అతడికి సంబంధం ఉంది. కొన్ని నెలల క్రితం సాజిద్ మహ్మద్ ఫయాజ్ ఉద్దీన్‌ను బెదిరించి దాడి చేశాడు. అప్పటి నుంచి ఫయాజ్ సాజిద్‌పై కక్ష పెంచుకున్నాడు. అబ్దుల్ ఖాదర్ ఇంటిపై సాజిద్ రాళ్లతో దాడి చేశాడు. 2019లో సాజిద్ ఇచ్చిన సమాచారం మేరకు బెదిరింపుల కేసులో షేక్ జమీర్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. సాజిద్‌పై ఆరుగురు యువకులు కక్ష పెంచుకుని అతడిని హతమార్చేందుకు కుట్ర పన్నారు. గత శనివారం అర్ధరాత్రి 10.30 గంటల సమయంలో సాజిద్‌ను షేక్ జమీర్ ఆజంపుర మునిసిపల్ గ్రౌండ్ వెనుక ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు పిలిపించాడు. అదే సమయంలో మిగతా ఐదుగురు అక్కడికి చేరుకుని చుట్టుముట్టగా సాజిద్‌ను అబ్దుల్ ఖాదర్ కత్తితో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సాజిద్ మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితులను సోమవారం పట్టుకున్నామని ఏసీపీ తెలిపారు.