నార్సింగ్‌, మణికొండల్లో ఆరు కొత్త రోడ్లు

ABN , First Publish Date - 2020-05-24T10:31:32+05:30 IST

ప్రజలకు రవాణా సౌకర్యం పెంపొందించేందుకు నార్సింగ్‌, మణికొండ ప్రాంతాల్లో ప్రభుత్వం మరో ఆరు రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

నార్సింగ్‌, మణికొండల్లో ఆరు కొత్త రోడ్లు

నార్సింగ్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు రవాణా సౌకర్యం పెంపొందించేందుకు నార్సింగ్‌, మణికొండ ప్రాంతాల్లో ప్రభుత్వం మరో ఆరు రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ రోడ్లను నిర్మించే ప్రాంతాలను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధికారుల బృందంతో శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరు కావాల్సి ఉండగా, ఆయన పర్యటన వాయిదా పడడంతో మేయర్‌ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. షేక్‌పేట్‌ నుంచి పుప్పాల్‌గూడ మణికొండ మీదుగా నార్సింగ్‌లోని అవతార్‌ చౌరస్తా వరకు 120 అడుగుల రేడియల్‌ రోడ్డు రావాలి. ఈ రోడ్డు కోసం పుప్పాల్‌గూడ వరకు పనులు జరిగి ఆగిపోయాయి.


ఈ రోడ్డును మేయర్‌ పరిశీలించారు. ల్యాంకోహిల్స్‌ చౌరస్తా నుంచి చిత్రపురి వరకు, ల్యాంకోహిల్స్‌ చౌరస్తా నుంచి ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ కాలనీ లే అవుట్‌ మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు, రేడియల్‌ రోడ్డు నుంచి నార్సింగ్‌ ముష్కిచెరువు మీదుగా హైటెన్షన్‌ వైర్ల కింద వంద అడుగుల రోడ్డు, నార్సింగ్‌ మెయిన్‌ రోడ్డు వరకు, రాయదుర్గం మల్కం చెరువు నుంచి హరివిల్లు వరకు హైటెన్షన్‌ వైర్ల కింద వంద అడుగుల రోడ్డును నిర్మించనున్నారు. ఇందులో భాగంగా రాయదుర్గం మల్కం చెరువు నుంచి హరివిల్లు వరకు రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాల కూల్చివేత పనులు శనివారం ప్రారంభించారు.


పుప్పాల్‌గూడలో హైటెన్షన్‌ వైర్ల కింద ల్యాంకోహిల్స్‌ నుంచి ఐఏఎస్‌ కాలనీకి వచ్చే మార్గంలో కొన్ని పంట పొలాలు ఉండడంతో రైతులతో చర్చించారు. భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ, ఆర్‌ అండ్‌ బీ, హెచ్‌ఎండీఏ అధికారులతో పాటు నార్సింగ్‌ చైర్‌పర్సన్‌ రేఖ, వైస్‌చైర్మన్‌ వెంకటేశ్‌ యాదవ్‌, కౌన్సిలర్లు కె.రామకృష్ణారెడ్డి, బి.కావ్యశ్రీరాములు, నార్సింగ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T10:31:32+05:30 IST