వేధిస్తోన్న సిబ్బంది కొరత

ABN , First Publish Date - 2020-03-15T10:49:11+05:30 IST

దక్షిణ మధ్య రైల్వేలోనే అతిపెద్ద రైల్వే రిజర్వేషన్‌ కార్యాలయంగా పేరున్న సికింద్రాబాద్‌ రైల్వే రిజర్వేషన్‌ కార్యాలయంలో సిబ్బంది కొరత

వేధిస్తోన్న సిబ్బంది కొరత

రైల్వే ప్రయాణికులకు నరకం..

సికింద్రాబాద్‌ రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లు పది

రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించేది 8మంది

టికెట్‌ కోసం గంటల కొద్ది క్యూ

కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు

అడ్డగుట్ట, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వేలోనే అతిపెద్ద రైల్వే రిజర్వేషన్‌ కార్యాలయంగా పేరున్న సికింద్రాబాద్‌ రైల్వే రిజర్వేషన్‌ కార్యాలయంలో సిబ్బంది కొరత ప్రయాణికులకు శాపంగా మారింది. ఈ కార్యాలయంలో 10కౌంటర్లు ఉన్నాయి. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పది కౌంటర్లలో పది మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఐదుగురు, మధ్యాహ్నం 2నుంచి రాత్రి 8గంటల వరకు ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ కార్యాలయంలో మొత్తం షిఫ్టుల వారీగా 70మంది ఉండాల్సి ఉండగా 20మంది ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. మిగతా ఉద్యోగుల్లో కొందరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. టికెట్‌ రిజర్వేషన్‌ కోసం గంటల కొద్ది క్యూలో ఉన్న ప్రయాణికులు సహనం కోల్పోతున్నారు. ఇదేమని అడిగితే సిబ్బంది లేరని ఉచిత సలహా ఇస్తున్నారు. గత ఆరు నెలలుగా సిబ్బంది కొరత ఉందని ఓ ఉద్యోగి చెప్పడం గమనార్హం.


సిటిజన్ల నరకయాతన..  

సిటిజన్లకు రైల్వే రిజర్వేషన్‌ కార్యాలయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. కూర్చోవడానికి సీట్లు లేవు. ఒక్కో కౌంటర్‌ వద్ద ఐదుగురు కూర్చునేందుకు మాత్రమే కుర్చీలు ఏర్పాటు చేశారు. మిగతా సిటిజన్లు క్యూలో నిలబడాల్సిందే. లేదంటే కొందరు నేలపైనే కూర్చుంటున్నారు. 


పనిచేయని డిస్‌ప్లేలు 

ప్రయాణికులు ఎంచుకున్న రైలు, వాటి వివరాలు కౌంటర్‌ వద్ద కంప్యూటర్‌లో కొడుతుంటే బయట ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన డిస్‌ప్లేలో కనిపించేది. ప్రస్తుతం పది రిజర్వేషన్‌ కౌంటర్లలో ఈ డిస్‌ప్లేలు పనిచేయడం లేదు. కేవలం డిస్‌ప్లేలో ప్రకటనలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఆదాయం బాటలో ఆలోచిస్తున్న రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


టాయిలెట్లు, కుర్చీల కొరత  

 రైల్వే రిజర్వేషన్‌ కార్యాలయంలో కుర్చీలు లేవు.  టికెట్‌ రిజర్వేషన్‌ కోసం వచ్చే వారు ఒక్కో కౌంటర్‌ వద్ద రెండు గంటలపాటు నిల్చోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు లేవు. కనీసం మూత్ర విసర్జన చేయడానికి కూడా లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు హైరానా పడుతున్నారు. పక్కనే రేతిఫైల్‌ బస్టాండ్‌ వద్ద పెయింగ్‌ టాయిలెట్లకు వెళ్లాల్సిన పరిస్ధితి. ఇప్పటికైనా సికింద్రాబాద్‌ రిజర్వేషన్‌ కౌంటర్లలో టికెట్‌ రిజర్వేషన్‌ కోసం వచ్చే ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. 


బోయగూడ వైపు కౌంటర్‌ వద్ద..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పరిధి బోయగూడ వైపు ఉన్న రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద ఇదే పరిస్థితి. రెండు కౌంటర్లు ఉండగా కేవలం ఒక కౌంటర్‌ మాత్రమే పనిచేస్తుంది. ఉదయం తత్కాల్‌ టికెట్ల సమయంలో సాధారణ ప్రయాణికులు రిజర్వేషన్‌ టికెట్ల కోసం రెండు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. అదనంగా కౌంటర్‌ ఉన్నా మూసే ఉంటుంది. రిజర్వేషన్‌ టికెట్‌ కూడా దొరికే పరిస్థితి లేదు. 


తాగునీరు కరువు..

దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులు తిరిగి ఊరెళ్లేందుకు రిజర్వేషన్‌ కార్యాలయానికి ప్రతి రోజూ వేలమంది వస్తారు. కనీసం కార్యాలయంలో తాగేందుకు నీటి కుళాయి లేకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం కావడంతో ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు.  


రిజర్వేషన్‌ టికెట్‌ కోసం వెళితే ఇబ్బందులు..

 నీలుఫర్‌, సికింద్రాబాద్‌ 

టికెట్‌ రిజర్వేషన్‌ కోసం వెళ్తే అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. మహిళలకు ప్రత్యేక కౌంటర్‌ లేదు. టికెట్‌ కోసం దాదాపు రెండు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. తాగేందుకు నీళ్లు లేవు. పది కౌంటర్లలో కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీని కారణంగా ఒక్కొక్కరు కౌంటర్‌లో రెండు గంటల పాటు నిల్చోవాల్సి వస్తుంది. రిజర్వేషన్‌ కౌంటర్‌లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రైల్వే అధికారులపై ఉంది. 


ప్రయాణికుల డిమాండ్లు ఇవే..

  1. రిజర్వేషన్‌ టికెట్‌ కోసం వచ్చే ప్రయాణికులకు రైళ్ల రాకపోకల వివరాలు చెప్పేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
  2. రిజర్వేషన్‌ కార్యాలయ ఆవరణలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. ఏటీఎం సెంటర్లకు అనుమతి ఇవ్వాలి.
  3. రిజర్వేషన్‌ టికెట్‌ కోసం క్యూ పద్ధతి పాటించేందుకు టోకెన్ల పద్ధతిని ప్రవేశపెట్టాలి.
  4. ప్రయాణికులందరూ కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయాలి. 
  5. తత్కాల్‌ టికెట్ల కోసం, సిటిజన్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి.
  6. సాధారణ టికెట్‌ ప్రయాణికులు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే సమయంలో టికెట్‌ వివరాలు తెలిసే డిస్‌ప్లే బోర్డులు ఉండాలి.
  7. కార్యాలయంలో మంచినీటి సౌకర్యం కల్పించాలి.
  8. క్యూ పద్ధతి పాటించేందుకు సెక్యూరిటీగార్డులను ఏర్పాటు చేయాలి.

Updated Date - 2020-03-15T10:49:11+05:30 IST