చేతులు మారనున్న మాల్స్‌..? కరోనా దెబ్బతో నష్టాల బాట పట్టడమే కారణం

ABN , First Publish Date - 2020-12-30T06:30:14+05:30 IST

నగరంలో దాదాపు 42కు పైగా చిన్నా

చేతులు మారనున్న మాల్స్‌..? కరోనా దెబ్బతో నష్టాల బాట పట్టడమే కారణం

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి భయాల వేళ నగరంలో ప్రాచుర్యం పొందిన మాల్స్‌లో నాలుగు చేతులు మారుతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. మాదాపూర్‌, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలలోనే ఉన్న ఈ మాల్స్‌లో ఒకటి ఇప్పటికే తమ గ్రూప్‌లో వాటాలు మారాయనే సూచికలు ఇస్తే, మరికొన్ని మాల్స్‌ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.  


అంచనాలు తప్పాయి...?

నగరంలో దాదాపు 42కు పైగా చిన్నా, పెద్ద మాల్స్‌ ఉన్నాయని అంచనా. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ- రీసెర్చ్‌ కంపెనీ అనరాక్‌ రిటైల్‌ అయితే 2022 నాటికి మరో 12 మాల్స్‌ రానున్నాయని కరోనాకు ముందు అంచనా వేసింది. కరోనా విజృంభణ, లాక్‌డౌన్స్‌తో వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. కొత్త మాల్స్‌ సం గతి దేవుడెరుగు... ఉన్న వాటికే దిక్కు లేదంటున్నారు మాల్స్‌ మేనేజర్లు. ఫుట్‌ఫాల్‌ గణనీయంగా పడిపోయింది. ఓవర్‌హెడ్స్‌ పెరిగిపోయాయి. నిర్వహణ కష్టంగా మారింది. ఓ మాల్‌ మేనేజర్‌ ఇదే విషయమై మాట్లాడుతూ థియేటర్లు ఉండే మాల్స్‌లో ఇటీవల అవి తెరుచుకున్నా ఆశించిన మేర ప్రేక్షకులు రావడం లేదు. స్టోర్లలో కొనుగోళ్లు తగ్గిపోయాయి. అన్‌లాక్‌ తర్వాత ఫుట్‌ఫాల్‌ పెరుగుతుందని చాలా మంది భావించారు. కానీ కరోనా భయాలు వెంటాడుతుండటంతో ఆ ఆశలు అడియాసలయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయన్నది పలువురి భావన. ‘వాస్తవానికి అన్‌లాక్‌ 5 వచ్చిన తర్వాత మాల్స్‌లో ఫుట్‌ఫాల్‌ కాస్త పెరిగింది కానీ గతంతో పోల్చుకుంటే 40-50ు తక్కువే. టికెటింగ్‌ తగ్గిపోవడంతో స్టోర్ల నిర్వహణ కష్టంగా మారింది’ అని పలు మాల్స్‌లో స్టోర్లను నిర్వహిస్తున్న ఓ సంస్థ ప్రతినిధి అన్నారు.


స్టోర్లు మూత పడుతున్నాయి... 

ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన మాల్స్‌లో సరిగా ఆక్యుపెన్సీ లేక సతమతమవుతుంటే, కరోనా ఇప్పుడు వాటి పాలిట అశనిపాతంగా మారింది. కరోనాదెబ్బకు అంతర్జాతీయ బ్రాండ్లు సైతం తమ ఔట్‌లెట్లు మూసేయడం, అంతర్జాతీయంగా కొన్ని బ్రాండ్లు దివాలా దిశగా పరుగులు తీయడం... నగరంలోని కొన్ని మాల్‌ ్సకు ఇబ్బందిగా మారింది. ఇదే విషయమై ఓ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ‘మన నగరం కాస్మోపాలిటన్‌ సిటీ. విభిన్న రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి స్థిరపడుతున్న వారు ఇక్కడ అధికంగా కనబడుతున్నారు. లోకల్‌ బ్రాండ్ల కన్నా ఇంటర్నేషనల్‌ బ్రాండ్లుకే డిమాండ్‌ అధికంగా ఉంటుంది. అవే ఇప్పుడు వెనక్కి వెళ్తుండటంతో చాలా మాల్స్‌ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి’ అని అన్నారు. వాస్తవానికి కొన్ని మాల్స్‌ ఇప్పుడు తమ రెసిడెంట్‌ స్టోర్స్‌కు రాయితీలు కూడా ఆఫర్‌ చేస్తుండటం గమనార్హం. మాల్స్‌లో ఫుట్‌ఫాల్‌ పడిపోవడానికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కూడా ఓ కారణంగా అభివర్ణించారు ఓ మాల్‌ పీఆర్‌ మేనేజర్‌. ఆయనే మాట్లాడుతూ ‘గచ్చిబౌలి, మాదాపూర్‌, కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌... ఇలా కొన్ని ప్రాంతాలలో మాల్స్‌కు ఆధారం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. వారే కొనుగోళ్లకు కారకులు. వర్క్‌ ఫ్రమ్‌ హోం కారణంగా ఇప్పుడు వారు రావడం లేదు. కొనుగోలుదారులు లేకపోవడంతో మాల్స్‌ చేతులు మారడం సంగతి తర్వాత షట్టర్లు మూసేసుకునే పరిస్థితి కూడా కొన్నిటికి రావొచ్చు.’ అన్నారు. కొంతమంది మాల్స్‌ నిర్వాహకులు మాత్రం ఆశాజనకంగానే ఉన్నారు. వ్యాక్సిన్‌ వస్తుండటంతో ఎప్పటిలా సాధారణ పరిస్థితులు వస్తాయని, ఈ కష్టాలు తాత్కాలికమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-30T06:30:14+05:30 IST