ఆపరేషన్‌ ‘కరోనా’

ABN , First Publish Date - 2020-03-19T09:55:28+05:30 IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన వారిని వచ్చినట్లే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన వార్డులు ఏర్పాటు చేసి అక్కడ పడకలు, సదుపాయాలతోపాటు ప్రయాణికులకు వసతి కల్పిస్తున్నారు.

ఆపరేషన్‌ ‘కరోనా’

హైదరాబాద్‌ సిటీ, మార్చి18 (ఆంధ్రజ్యోతి) : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన వారిని వచ్చినట్లే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన వార్డులు ఏర్పాటు చేసి అక్కడ పడకలు, సదుపాయాలతోపాటు ప్రయాణికులకు వసతి కల్పిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వార్డులకు ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికులను వెంటనే తరలిస్తున్నారు. ఇప్పటికే అనంతగిరిహిల్స్‌లో ఏర్పాటు చేసిన ప్రగతి రిసార్ట్స్‌, దూలపల్లిలోని ఫారెస్ట్‌ అకడామీ కేంద్రానికి ప్రయాణికులను తరలించారు. 


విదేశాల నుంచి నగరానికి వచ్చిన 56 మందిని దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. 14 రోజుల వరకు వారిని అక్కడే ఉంచి పర్యవేక్షించనున్నారు. అందులో అనుమానితులు ఎవరైనా ఉంటే వారి నుంచి నమునాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించి నిర్ధారించనున్నారు. ఇందులో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వారిని వెంటనే సమీపంలోని కరోనా చికిత్స కేంద్రానికి తరలించనున్నారు. ఆయా క్వారంటైన్‌ కేంద్రాల వద్ద అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉంచారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో 15 ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేంద్రాల్లో దాదాపు 10 వేల పడకలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. రాజేంద్రనగర్‌ పరిధిలో అనేక సంస్థలు, విద్యాలయాలకు సంబంధించిన హాస్టళ్లను స్వాధీనం చేసుకుని అక్కడ క్వారంటైన్‌ వార్డులు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలోని క్రీడాకారుల హాస్టల్‌ భవనంలో దాదాపు 250 పడకలను ఇప్పటికే సిద్ధం చేశారు. 


చెస్ట్‌ ఆస్పత్రిలో 11 మంది అనుమానితులు...

గాంధీ ఆస్పత్రితో పాటు ఇప్పుడు చెస్ట్‌ ఆస్పత్రిలో కూడా కరోనా చికిత్స ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. 52 పడకలతో, ఆక్సిజన్‌, వెంటిలేటర్లను సిద్ధం చేశారు. బుధవారం 11 మంది అనుమానితులను ఇక్కడకు తరలించి వారి నుంచి నమూనాలను సేకరించారు. నిర్ధారణ చేసే వరకు వారు ఆస్పత్రిలోనే ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. గాంధీ ఆస్పత్రిలో బుధవారం 94 మంది అనుమానితులు వైద్య సేవలు పొందారు. 


ఆస్పత్రిలో 22 మంది చికిత్స పొందుతున్నారు. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయడానికి ల్యాబ్‌ సదుపాయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఐటీఎంఆర్‌ భవనంలో కరోనా అనుమానితులకు చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో 150 పడకలతో ఐసొలేషన్‌ వార్డులు సిద్ధమవుతున్నాయి. ఐదు రోజుల్లో పనులు పూర్తి చేసి ఇక్కడ కరోనా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ రెండు మహిళా వార్డులు, మరో  రెండు పురుషుల వార్డులను సిద్ధం చేస్తున్నారు. 


అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విదేశీ ప్రయాణికులను క్వారంటైన్‌ చేస్తున్నారు. అయితే ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. వీరి వల్ల ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 15 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. 

Updated Date - 2020-03-19T09:55:28+05:30 IST