మరో ఏడాదిపాటు అవుట్ సోర్సింగ్ ఇంజనీర్ల సేవలు
ABN , First Publish Date - 2020-09-18T09:31:00+05:30 IST
గ్రేటర్‌లో కొనసాగుతోన్న ప్రాజెక్టుల కోసం నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) ద్వారా అవుట్ సోర్సింగ్

స్టాండింగ్ కమిటీ ఆమోదం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 17 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌లో కొనసాగుతోన్న ప్రాజెక్టుల కోసం నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో విధుల్లోకి తీసుకున్న ఇంజనీర్ల సేవలను మరో ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. మీటింగ్‌లో ఇతర అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఆర్‌డీపీ, రెండు పడకలు, ఇతర ప్రాజెక్టుల కోసం రెండు విడతలుగా తీసుకున్న 250మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను వచ్చే ఏడాది అక్టోబర్ 31 వరకు పొడిగించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్‌కుమార్, సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో చేసిన మరికొన్ని తీర్మానాలు...
- యూసుఫ్‌గూడ సర్కిల్ కార్యాలయాన్ని రూ. 5.95 కోట్లతో నిర్మించాలి. యూసుఫ్‌గూడ బస్తీ జంక్షన్‌లోని పాత వార్డు కార్యాలయం పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్ భవనాన్ని కూల్చి ఆ స్థలంలో భవనం నిర్మించనున్నారు.
- హైటెక్స్ కమాన్ నుంచి హెచ్‌ఐసీసీ మెయిన్ గేట్ వరకు ట్రాఫిక్ ఐలాండ్‌ల నిర్వహణను సీఎస్‌ఆర్ కింద ఏడాదిపాటు స్మైల్ లైన్ టెండర్ ఆస్పత్రికి అప్పగించాలి.
- శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని త్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి రాడిసన్ హోటల్ వరకు సెంట్రల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్‌ల నిర్వహణ సంవత్సరంపాటు మైడీఎల్‌ఎఫ్ ఫౌండేషన్‌కు అప్పగించాలి.
- యాకుత్‌పురా నుంచి ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వరకు ఆర్‌యూబీ, ఆర్‌సీసీ బాక్స్ డ్రెయిన్, అప్రోచ్ రోడ్ల నిర్మాణ వ్యయాన్ని రూ. 4.45 కోట్ల నుంచి రూ. 6.55 కోట్లకు పెంచాలి.