రియల్టర్‌ బలవన్మరణం

ABN , First Publish Date - 2020-02-12T09:28:01+05:30 IST

ఆర్థిక ఇబ్బందులు.. మానసిక ఒత్తిళ్లు ఓ రియల్టర్‌ ప్రాణాన్ని బలిగొన్నాయి. మానసిక వేదన అతడి బలవన్మరణానికి దారితీసింది.

రియల్టర్‌ బలవన్మరణం

 ఒంటరి పోరాటంతో అలసిపోయానంటూ సెల్ఫీ వీడియో

వేధింపుల వల్లే : కుటుంబ సభ్యుల ఆరోపణ

వేర్వేరు ప్రాంతాల్లో దంపతులు సహా మరో ఆరుగురి ఆత్మహత్య


దిల్‌సుఖ్‌నగర్‌, ఫిబ్రవరి11 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు.. మానసిక ఒత్తిళ్లు ఓ రియల్టర్‌ ప్రాణాన్ని బలిగొన్నాయి. మానసిక వేదన అతడి బలవన్మరణానికి దారితీసింది. వ్యాపార లావాదేవీలు నిర్వహించే తన క్యాబిన్‌లోనే ఉరేసుకున్న విషాదకరమైన ఘటన మంగళవారం జరిగింది. 


‘‘జీవితంలో ఒంటరిగా పోరాటం చేసే ఓపిక నశించింది.. రోజురోజుకూ సమస్యల ఊబిలో కూరుకుపోతూ.. వ్యాపారంలో అబద్ధాలు ఆడే ఓపిక లేదు... వీటన్నింటి నుంచి శాశ్వతంగా దూరమయ్యేందుకు నిర్ణయించుకున్నానంటూ’’ సెల్ఫీ వీడియో తీసుకొని కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. భాగస్వాముల మోసం, ఒత్తిడి వల్లే తన తండ్రి ఉరేసుకున్నాడని మృతుడి కుమార్తె చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా, శౌలిగౌరారం మండ లం, చిత్తలూరు గ్రామానికి చెందిన ఎద్దు యాదగిరి (55), జ్యోతి దంపతులు కుమారుడు పవన్‌సాయి, కుమార్తె సాయి నిఖితతో కలిసి దశాబ్దం క్రితం నగరానికి వచ్చి ఉప్పల్‌ డిపో సమీపంలోగల మల్లికార్జుననగర్‌లో ఉంటున్నారు.


యాదగిరి ఆరుగురు భాగస్వాములతో కలిసి రెండున్నరేళ్ల క్రితం నాగోల్‌లో షణ్ముఖ మార్కెటింగ్‌ సర్వీసె్‌స(ఎ్‌సఎంఎ్‌స)పేరిట రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వెంచర్లను మార్కెటింగ్‌కు తీసుకొని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపార లావాదేవీల్లో కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అతడు మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. సమస్యలు అధికమవడంతో మానసికంగా కృంగిపోయాడు.


గంటలో వస్తానంటూ...

మరణమే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు నాగోల్‌లోని కార్యాలయానికి బయల్దేరాడు. గంటలో వస్తానని భార్య జ్యోతికి చెప్పి వెళ్లాడు. ఉదయం 10.30 గంటల సమయంలో ఇద్దరు ఉద్యోగినులు  కార్యాలయానికి వెళ్లి క్యాబిన్‌లోకి వెళ్లి చూడగా యాదగిరి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అలివేలు అనే ఉద్యోగిని సిబ్బందికి, కుటుంబ సభ్యులు, చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతుడి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. 


పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ

యాదగిరి పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించేవాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గంటలో వస్తానని ఆత్మహత్య చేసుకున్నాడంటూ భార్య రోదిస్తోంది. గతనెల 29న కుమారుడు పవన్‌సాయిని ఉన్నత చదువు కోసం యూకే పంపించాడు. కుమార్తె పెళ్లి ఘనంగా చేయాలనుకున్న అతడు ఇంతలోనే ఇలా చేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.


క్షమించండి అంటూ వీడియో... 

జీవన పోరాటంలో అన్ని రకాలుగా కుంగిపోయిన యాదయ్య ఆత్మహత్య చేసుకునే ముందు ‘డియర్‌ ఎస్‌ఎంస్‌ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్‌.. నన్ను క్షమించండి’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రెండున్నరేళ్లలో మీరు ఇచ్చిన (వ్యాపార భాగస్వాములు) సహకారంతో నా తప్పులు, మీ తప్పులు సరిదిద్దుకుంటూ కంపెనీని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాను. జీవితం అంతా ఒంటరి పోరాటం చేసే ఓపిక నశించింది. రోజు రోజుకూ పెరుగుతున్న సమస్యల నుంచి శాశ్వతంగా దూరమవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరెవరూ ఆందోళన చెందవద్దు. ఉన్న కస్టమర్లతో కంపెనీని కొనసాగించండి. నన్ను చాలామంది వాడుకున్నారు. అబద్ధాలు చెప్పని నేను రెండున్నరేళ్లలో ఒక అబద్ధం కప్పి పుచ్చుకునేందుకు ప్రతిరోజూ వంద అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. మీకు అన్నీ తెలుసు.. ఇక అబద్ధాలు ఆడే ఓపిక నాకు లేదు. నర్సింహ అన్నా... 9 గంటల వరకు ఆఫీసుకు రా.. మిస్‌ చేయకు.. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా..


భాగస్వాములను విచారించాలి

భాగస్వాముల వేధింపుల వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి కుమార్తె నిఖిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇల్లందు శ్రీనివాస్‌ అనే వ్యక్తి రూ.12 లక్షలు ఇవ్వాలని వేధిస్తూ.. ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక మనస్తాపంతో ఉరేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఎస్‌ఎంఎ్‌సకు సంబంధించి ఫణికుమార్‌, చంద్రశేఖర్‌రెడ్డి, సైదేశ్వర్‌రావు, రవికుమార్‌, నర్సింహ, సత్యనారాయణను విచారించాలని కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ జానకిరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-02-12T09:28:01+05:30 IST