కంటోన్మెంట్‌ అలర్ట్‌..!

ABN , First Publish Date - 2020-03-04T07:54:14+05:30 IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కంటోన్మెంట్‌ బోర్డు యంత్రాంగం అప్రమత్తమైంది.

కంటోన్మెంట్‌ అలర్ట్‌..!

స్థానికుడికి కరోనా పాజిటివ్‌

అప్రమత్తమైన బోర్డు యంత్రాంగం

పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలు 


సికింద్రాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కంటోన్మెంట్‌ బోర్డు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన యువకుడు కరోనా వైరస్‌ సోకి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తమ ప్రాంతానికి చెందిన యువకుడికి వైరస్‌ సోకినట్లు తేలడంతో కంటోన్మెంట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సదరు యువకుడి ఇంటి పరిసరాలతో పాటు మొత్తం కంటోన్మెంట్‌లో పారిశుధ్య నిర్వహణపై బోర్డు దృష్టి సారించింది. కంటోన్మెంట్‌ ముఖ్య కార్యా నిర్వహణాధికారి ఎస్‌వీఆర్‌ చంద్రశేఖర్‌ పర్యవేక్షణలో శానిటేషన్‌ సూపరింటెండెంట్‌ దేవేందర్‌ ఆధ్వర్యంలో 16 మంది శానిటరీ సూపర్‌వైజర్లు, 20 మంది ప్రైవేటు సూపర్‌వైజర్లు, 400 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మంగళవారం ఉదయం నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో నిమగ్నమయ్యారు. అధికారులు, సిబ్బందికి మాస్క్‌లు, గ్లవుజులు అందించారు. కంటోన్మెంట్‌లోని అన్ని వీధులతోపాటు ఇతర కాలనీలు, బస్తీల్లోని చెత్త కుండీల వద్ద, మురుగునీరు ప్రవహించే ప్రాంతాల వద్ద, నాలాల చుట్టు పక్కల, ఖాళీ ప్రదేశాల్లో బ్లీచింగ్‌ పొడి, సున్నం పొడి చల్లుతున్నారు. పరిసరాల పరిశుభ్రతకు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నారు.


దీని కోసం చెత్తను తరలించే 8 భారీ వాహనాలు, ఒక ప్రొక్లెయినర్‌, ఒక ఎక్సకవేటర్‌, 5 డెబ్రిస్‌ వాహనాలు, 10 డంపర్‌ ప్లస్‌లు తదితర యంత్ర సామగ్రిని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీని కోసం కరపత్రాల ముద్రణ, పంపిణీ చేయడంపై దృష్టి సారించారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఉప కమిషనర్‌ కె. రవి కుమార్‌ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.   

Updated Date - 2020-03-04T07:54:14+05:30 IST