కంటెయినర్ల విధ్వంసం.. రోడ్లు ఛిద్రం.. రాత్రి వేసిన రోడ్డు ఉదయానికి గుంతలు
ABN , First Publish Date - 2020-12-28T06:26:53+05:30 IST
గోషామహల్ అజీజ్‌బాగ్‌లో

పగిలిన మంచినీటి పైపులు, ఒరిగిన విద్యుత్ స్తంభాలు
బస్తీల్లో అక్రమ గోదాంలు... కంటెయినర్ లారీల రాకపోకలు
ఫిర్యాదు చేస్తే తమకు సంబంధం లేదంటున్న జీహెచ్‌ఎంసీ అధికారులు
మంగళ్‌హాట్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): గోషామహల్ అజీజ్‌బాగ్‌లో రోడ్డు వేసి 24 గంటలు గడవక ముందే భారీ కంటైనర్ లారీల కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అద్దె తక్కువకు వస్తుందని బస్తీల్లో ఏర్పాటు చేసిన అక్రమ గోదాముల్లో లోడు దింపేందుకు వస్తున్న భారీ వాహనాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం అజిజ్‌బాగ్‌లో అధికారులు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు పూర్తయిన మరుసటి రోజు అర్ధరాత్రి ఫ్లైవుడ్ లోడ్‌తో మహారాష్ట్రకు చెందిన భారీ కంటైనర్ (ఎంహెచ్ 12 ఆర్‌ఎన్ 5349) ఫ్లైవుడ్ లోడ్‌తో రావడంతో ఆ రోడ్డు ధ్వంసమైంది. రోడ్డు కుంగిపోయి మంచి నీటి పైప్‌లైన్‌లు కూడా విరిగిపోయాయి. భారీగా మంచినీరు వృథా అయింది. దీంతో స్థానిక మహిళలు లారీ ముందు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంతో బస్తీల్లో అత్యధిక సంఖ్యలో వెలిసిన అక్రమ గోదాములు బయటపడ్డాయి. రోజూ అర్ధరాత్రి వేళ హర్యాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ఇలా ఇతర రాష్ట్రాల నుంచి భారీ కంటైనర్లు ఫ్లైవుడ్ లోడ్‌తో గోదాంలకు వస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో వేసిన రోడ్లు రెండు నెలలు కూడా ఉండడం లేదు. విద్యుత్ స్తంభాలు సైతం ఒకవైపు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. ఆర్‌కే పేట్ నుంచి దత్తాత్రేయ కమాన్ వరకు దాదాపు కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం మొదట్లో వేసిన రోడ్డు కంటైనర్లు, గోదాంలకు వచ్చి పోయే లోడ్ ఆటోలు, ట్రాలీలతో పూర్తిగా కుంగిపోయి, కంకర తేలి ప్రమాదకరంగా మారింది.
అధికారుల పొంతనలేని సమాధానాలు
రాత్రి వేసిన రోడ్డు ఉదయం వరకు ధ్వంసమైందని జీహెచ్‌ఎంసీ - 14 డిప్యూటీ ఇంజినీర్ మణిపాల్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ‘‘ఆ రోడ్డు జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో వేయలేదు. అది మాకు సంబంధం లేదు..’ అని ఆయన సమాధానం చెప్పడం విశేషం. అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమల రెడ్డికి ఫిర్యాదు చేయగా ‘‘అసలు కంటైనర్లు రానేరావు. అయినా ఆ రోడ్డుకు, మాకు సంబంధం లేదు. ఎమ్మెల్యే బడ్జెట్‌లో రోడ్డు వేశారు. అందుకు వేరే అధికారులు ఉన్నారు’’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం కొసమెరుపు. గోదాములు ఏర్పాటు చేయాలంటే విద్యుత్, జలమండలి, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్, అగ్నిమాపక విభాగం, పోలీసులు, ట్రాఫిక్, కమర్షియల్ ట్యాక్స్‌తో పాటు స్థానికుల అనుమతి కూడా ఉండాలి. ఇక్కడ అలాంటిదేమీ కనిపించడం లేదు. గోషామహల్ ప్రాంతంలో ఉన్న అనేక షాపులకు చెందిన భారీ గోదాంలు ఇక్కడే ఉన్నాయి.
ప్రమాదాలు జరిగినా మారని తీరు...
- సీతారాంబాగ్ ఈఎస్‌ఐ ఆసుపత్రికి ఆనుకొని ఉన్న వైన్ షాప్ వద్ద మద్యం తాగి ఓ వ్యక్తి అక్కడే పడుకున్నాడు. ఆ వ్యక్తిపై నుంచి అర్థరాత్రి ఫ్లైవుడ్ లోడ్‌తో వచ్చిన భారీ లారీ వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ సంఘటనలో ఇప్పటికీ అధికారులు ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- గతంలో ఓల్డ్ మల్లేపల్లి ప్రాంతంలోని ఐదంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు మూడు రోజుల పాటు మంటలు చల్లారక పోగా భవనం మొత్తం కుప్పకూలింది. అప్పట్లో ఈ సంఘటన సంచలనం రేపింది. వెంటనే అన్ని గోదాములపైనా చర్యలు తీసుకుంటామని నాటి మేయర్ మొదలు కొని మంత్రి వరకు ప్రకటించారు. నేటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు.
- లాక్‌డౌన్ ముగిసిన వెంటనే మంగళ్‌హాట్‌లోని ఓ ఫ్లైవుడ్ గోదాంలో మంటలు చెలరేగడంతో మార్కెట్ ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
- సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్‌లో ఏర్పాటు చేసిన దాదాపు 8 ఫ్లైవుడ్ గోదాంల కారణంగా ఇప్పటికే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఐదు సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి గోదాంలలో భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
ఈ బస్తీల్లో అధిక గోదాములు
జీహెచ్‌ఎంసీ సర్కిల్ - 14 పరిధిలోని మంగళ్‌హాట్, గోడేకి కబర్, బోయిగూడ కమాన్, ఇందిరానగర్, అజీజ్‌బాగ్, సీతారాంబాగ్, మల్లేపల్లి, ఓల్డ్ మల్లేపల్లి, ద్రౌపది గార్డెన్, మేదర్ బస్తీ, బైటక్‌లతో పాటు గోషామహల్, ఆగాపురా తదితర ప్రాంతాల్లో దశాబ్ద కాలంగా పెద్ద సంఖ్యలో ఫ్లైవుడ్, ప్లాస్టిక్, డోర్స్ ఇలా అనేక గోదాంలు వెలిశాయి. రాత్రికి రాత్రే కొత్తగా మరిన్ని గోదాములు పుట్టుకొస్తున్నాయి. అసలే ఇరుకైన రహదారులు ఈ రహదారుల్లో 24 గంటల పాటు భారీ వాహనాల రాకపోకలు సాగుతుండడంతో స్థానికులకు కంటి మీద కునుకులేకుండా పోతోంది. ఇదే విషయమై పలు మార్లు జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకురాగా తమకు సంబంధం లేదంటున్నారని స్థానికులు చెబుతున్నారు.
భద్రత పాటించని గోదాంలు
వేలు, లక్షలు కాదు ఏకంగా నెలకు దాదాపు 800 కోట్ల వ్యాపారం ఈ గోదాం ద్వారా సాగుతోంది. అయినప్పటికీ అధికారుల కంటికి కనిపించడం లేదు. బస్తీలలో గోదాంలను ఏర్పాటు చేస్తే అడిగే వారు ఉండరనే ధీమాతో వందల సంఖ్యలో గోదాంలు ఏర్పాటు ఏస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు. అనుమతుల సంగతి దేవుడెరుగు ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ సదుపాయం వంటివి మచ్చుకైనా కనిపించవు. గోషామహల్ వ్యాపారులు తెలుగురాష్ట్రాలలోని అన్ని జిల్లాలకూ ఇక్కడి నుంచే ప్లైవుడ్‌ను హోల్‌సేల్‌గా సరఫరా చేస్తుంటారు.
