మళ్లీ పంజా..గ్రేటర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం
ABN , First Publish Date - 2020-10-27T09:55:26+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్‌లో వాయు కాలుష్యం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. లాక్‌డౌన్ ముందు ప్రమాదకర స్థాయిలో ఉన్న కాలుష్య తీవ్రత లాక్‌డౌన్ సమయంలో సాధారణ స్థితికి చేరింది

వ్యక్తిగత వాహనాల వినియోగం అధికమవ్వడమే కారణం
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌లో వాయు కాలుష్యం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. లాక్‌డౌన్ ముందు ప్రమాదకర స్థాయిలో ఉన్న కాలుష్య తీవ్రత లాక్‌డౌన్ సమయంలో సాధారణ స్థితికి చేరింది. అన్‌లాక్ దశలు ప్రారంభమయ్యాక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిఽధిగా కొనసాగుతున్నాయి. విద్యా సంస్థలు, సినిమా థియేటర్‌లు మినహాయిస్తే ఇతర కార్యకలాపాలన్నీ కొనసాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ బాగానే పెరిగింది. ఒక్క ఐటీ కారిడార్‌ను మినహాయిస్తే నగరం నలుమూలల వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
గణనీయంగా పెరిగిన వ్యక్తిగత వాహనాలు..
కరోనా ప్రభావంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. కరోనాకు ముందు గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సులు, మెట్రోరైలు, ఎంఎంటీఎస్ ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా ఉండేవి. సిటీ బస్సుల్లో రోజూ 33 లక్షల మంది, మెట్రోలో రోజుకు 4 లక్షలు, ఎంఎంటీఎస్ రైళ్లలో 1.50లక్షల మంది ప్రయాణం చేసే వారు. ప్రస్తుతం నడుస్తున్న మెట్రోలో రోజుకు లక్ష లోపే ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నడుస్తున్నా అందులోనూ అంతంత మాత్రమే. ఎంఎంటీఎస్ రైళ్లు ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో మెజారిటీ నగర వాసులు సొంత వాహనాల్లోనే ప్రయాణం చే స్తున్నారు.
రోడ్లపై ట్రాఫిక్ రద్దీ...
కరోనా ప్రభావం ఉన్నా నగరవాసులంతా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తోంది. కొంత మంది వృద్ధులు, పిల్లలు మినహాయిస్తే మిగతా వారంతా తమ రోజు వారి కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. దీంతో వాహనాల రద్దీ పెరిగి వాయు కాలుష్యం తీవ్రత క్రమంగా పెరుగుతోంది. లాక్‌డౌన్ సమయంలో అంటే ఏప్రిల్, మే నెలల్లో వాయు కాలుష్య తీవ్రత 12-30 మైక్రో గ్రామ్స్ ఇన్ క్యూబిక్‌గా ఉంటే, ప్రస్తుతం 12-122 మధ్య ఉంది. గత ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కాలుష్యం క్రమంగా పెరుగుతోందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యా సంస్థలు, సినిమా థియేటర్‌లు తెరిస్తే కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సొంత వాహనాల వినియోగం తగ్గితే కానీ వాయు కాలుష్య తీవ్రత తగ్గదని సూచిస్తున్నారు.
కాలుష్య తీవ్రత ఇలా...
మే చివరివారంలో అక్టోబర్ 26న వారంలో 26న
జూ పార్కు 59 160
సనత్‌నగర్ 25 155
హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ 61 152
సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) 14 159
ఐడీఏ బొల్లారం 46 159
ఇక్రిశాట్ పటాన్‌చెరు 11 164
ఐడీఏ పాశమైలారం 38 164