చెరువు కబ్జాపై కేసు
ABN , First Publish Date - 2020-05-19T10:57:36+05:30 IST
‘ఇదే అదును.. చేసేయ్ చదును’ అన్న శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

పరిశీలించిన రెండు మండలాల అధికారులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్‌ఐ
రాజేంద్రనగర్, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘ఇదే అదును.. చేసేయ్ చదును’ అన్న శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం సరిహద్దుల్లో విస్తరించి ఉన్న మైలార్‌దేవ్‌పల్లి పల్లె చెరువును ప్రాంతాన్ని రెండు మండలాల అధికారులు సందర్శించారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్‌గౌడ్, ఆర్‌ఐ రవికుమార్, సర్వేయర్ గణేశ్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌లఆఫ్ సర్వే కృష్ణతోపాటు బండ్లగూడ ఆర్‌ఐ శ్రీనివాస్, నీటి పారుదల శాఖ ఏఈ విశ్వం పల్లెచెరువు వద్దకు వచ్చి, పరిస్థితిని తెలుసుకున్నారు. రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి కూడా చెరువును పరిశీలించారు.
అన్ని పండగలు అక్కడే..
బతుకమ్మ ఉత్సవాలు, బోనాలు, దసరా పండుగ రోజు రావణ దహనం, వినాయక నిమజ్జనాలు ఇలా అన్ని పండుగలు పల్లెచెరువు వద్దనే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే చాలా వరకు ఈ చెరువు కబ్జాకు గురైంది. ప్రస్తుతం బాహాటంగా చెరువు ఎఫ్‌టీఎల్ స్థలంలో మట్టి పోస్తున్నారు. ఇదేమని అడిగితే తమకు కోర్టు నుంచి ఆర్డర్ ఉందని, ఇంకా అడిగితే బెదిరిస్తున్నారని స్థానికులు అంటున్నారు.
సర్వే చేసి, నివేదిక ఇస్తాం
పల్లె చెరువు అంతా శిఖం పట్టా. అక్కడ నీరు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు. రాజేంద్రనగర్ మండల పరిధిలో చెరువులో మట్టిపోయడం, కబ్జాలు కానీ జరగలేదు. సర్వేయర్‌తో హద్దులు నిర్ణయించాం. సర్వే నివేదికను ఆర్డీవోకు, కలెక్టర్‌కు పంపిస్తాం.
- చంద్రశేఖర్‌గౌడ్, తహసీల్దార్, రాజేంద్రనగర్
పోలీసులకు ఫిర్యాదు చేశాం
పల్లె చెరువులో మట్టి పోసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం అందగానే ఆదివారం రాజేంద్రనగర్ ఏసీపీకి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించాను. పోలీసులు వెళ్లి చెరువులో మట్టి పోస్తున్న లారీలను సీజ్ చేశారు. సోమవారం ఇరిగేషన్ ఏఈ విశ్వంతోపాటు బండ్లగూడ ఆర్‌ఐ శ్రీనివాస్ వెళ్లి చెరువు ఎఫ్‌టీఎల్ దాటి మట్టిపోస్తున్నట్లు గుర్తించారు. దీనిపై ఆర్‌ఐ శ్రీనివాస్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాం.
- ఫర్హీన్ షేక్, బండ్లగూడ తహసీల్దార్
ఫిర్యాదు వచ్చింది
పల్లెచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టిపోసి పూడ్చివేస్తున్నారని బండ్లగూడ ఆర్‌ఐ శ్రీనివాస్, ఇరిగేషన్ ఏఈ విశ్వంలు సోమవారం ఫిర్యాదు చేశారు. మట్టిపోసిన వారిపై కేసులు నమోదు చేశాం. ఆదివారమే చెరువులో మట్టిపోస్తున్న లారీలను సీజ్ చేశాం. కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో మిగతా వివరాలు చెప్పలేం.
- సత్తయ్య, ఇన్‌స్పెక్టర్, మైలార్‌దేవ్‌పల్లి