రిజర్వేషన్లు యథాతథం..?

ABN , First Publish Date - 2020-09-25T07:19:27+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గత రిజర్వేషన్లే కొనసాగుతాయా...? అనే అంశంపై ఉన్నతస్థాయిలో చర్చలు

రిజర్వేషన్లు యథాతథం..?

ఉన్నతస్థాయిలో చర్చలు

సాధ్యాసాధ్యాల పరిశీలన

చట్టం సవరిస్తేనే అవకాశం


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌  24 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గత రిజర్వేషన్లే కొనసాగుతాయా...? అనే అంశంపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల ఉన్నత స్థాయిలో జరిగిన సమావేశంతో పాటు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద భూముల క్రమబద్ధీకరణపై జరిగిన మీటింగ్‌లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కీలకం కానుంది. గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణ దాదాపుగా ఖరారైంది. సన్నాహక చర్యలనూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్‌ మాసాంతం లేదా జనవరి మొదటి వారంలో పోలింగ్‌ జరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందే సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలి.


ఇందులో బీసీ ఓటర్ల సర్వే, రిజర్వేషన్ల ఖరారు కీలకం. రిజర్వేషన్లు నిర్ణయించాకే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోన్న ప్రభుత్వం... అందుకు అందుబాటులో ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ 1955 చట్టం ప్రకారం ప్రతి ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఈ లెక్కన ఎన్నికలు ఐదేళ్లకోసారి జరిగినా... అంత కంటే ఎక్కువ సంవత్సరాలకు నిర్వహించినా.. కొత్తగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో కొన్నాళ్ల క్రితం అమలులోకి తీసుకువచ్చిన మునిసిపల్‌ యాక్ట్‌లో ఒకసారి ఖరారైన రిజర్వేషన్లు రెండు పర్యాయాల ఎన్నికల్లో కొనసాగుతాయని స్పష్టంగా ఉంది.


అదే ప్రాతిపదికన గ్రేటర్‌లోనూ రిజర్వేషన్లు కొనసాగించడంపై సమాలోచనలు జరుగుతున్నట్టు తెలిసింది. మునిసిపల్‌ యాక్ట్‌ గ్రేటర్‌కు వర్తించని నేపథ్యంలో.. ఇక్కడ రిజర్వేషన్లు కొనసాగించాలంటే జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించాలి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన దృష్ట్యా... రిజర్వేషన్లు మార్చకూడదనుకుంటే ఆర్డినెన్స్‌ జారీ చేసే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారొకరు తెలిపారు. రిజర్వేషన్లు మారినా.. యథాతథంగా కొనసాగినా... స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలనే నిబంధన అమలవుతుంది. 2016లో బీసీలకు 50, ఎస్సీలకు 10, ఎస్టీలకు  2, జనరల్‌ కేటగిరీలో 88 వార్డులు కేటాయించారు. 


2016 ఎన్నికల రిజర్వేషన్లు...

బీసీ మహిళ - 25

బీసీ జనరల్‌ - 25

ఎస్సీ జనరల్‌- 5

ఎస్సీ మహిళ - 5

ఎస్టీ జనరల్‌- 1

ఎస్టీ మహిళ - 1

అన్‌రిజర్వ్‌డ్‌- 44

జనరల్‌ మహిళ - 44

Updated Date - 2020-09-25T07:19:27+05:30 IST