చిన్నారిని అపహరించిన మహిళకు రిమాండ్‌

ABN , First Publish Date - 2020-06-26T09:46:43+05:30 IST

మూడేళ్ల చిన్నారిని అపహరించిన మహిళను బోయినపల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

చిన్నారిని అపహరించిన మహిళకు రిమాండ్‌

మరొకరి కోసం గాలింపు


బోయినపల్లి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మూడేళ్ల చిన్నారిని అపహరించిన మహిళను బోయినపల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం సేరుపల్లి బంధారం గ్రామానికి చెందిన పాతిర ఆంజనేయులు, స్వరూప దంపతులకు కూతురు(3) ఉంది. ఆంజనేయులు నిత్యం మద్యం తాగుతూ భార్యతో గొడవ పడేవాడు. స్వరూప తన కూతురుతో కలిసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో భిక్షాటన చేస్తుంటుంది. కాగా ఐడీఏ బొల్లారంలో ఉంటూ కూలీ పని చేసుకుంటున్న నాగమ్మను ఓ వ్యక్తి కలిసి, తనను జనార్దన్‌గా పరిచయం చేసుకున్నాడు. స్టేషన్‌ పరిసరాల్లో భిక్షాటన చేసుకుంటున్న స్వరూప కూతురుని కిడ్నాప్‌ చేద్దామని, అందుకు డబ్బులు ఇస్తానని చెప్పాడు. దాంతో ఆమె అంగీకరించింది.


ఈ నెల 21న పథకం ప్రకారం నాగమ్మ, జనార్దన్‌ స్వరూపను పరిచయం చేసుకుని మాటా మాటా కలిపారు. స్వరూపను నాగమ్మ తన ఇంటికి రావాలని కోరడంతో ఆమె తన కూతురుతో పాటు వారి వెంట వెళ్లింది. న్యూబోయినపల్లి బస్టాప్‌ వద్దకు రాగానే పాపకు తినడానికి ఏమైౖనా తీసుకురమ్మని నాగమ్మ 50 రూపాయలు ఇవ్వడంతో స్వరూప వెళ్లింది. ఈలోపు నాగమ్మ చిన్నారితో ఉడాయించింది. తన కూతురు, నాగమ్మ కనిపించకపోవడంతో పక్కనే ఉన్న బోయినపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు.


నిందితురాలు నిజామాబాద్‌ బస్సు ఎక్కినట్టు గుర్తించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. బస్సు కండక్టర్‌, డ్రైవర్‌ ఫోన్‌ నెంబర్లు తెలుసుకుని పోలీసులు వారికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ఈలోపు రామాయంపేట్‌ పోలీసులకు కూడా సమాచారం అందించారు. దాంతో అప్రమత్తమైన రామాయంపేట్‌  పోలీసులు నాగమ్మను అదుపులోకి తీసుకుని చిన్నారిని బోయినపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు గురువారం నాగమ్మను రిమాండ్‌కు తరలించి జనార్దన్‌ కోసం గాలిస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించి మూడు గంటల్లోపు కేసును ఛేదించిన సీఐ అంజయ్య, ఎస్సై సుధాకర్‌రెడ్డిని ఉన్నతాధికారులు అభినందించారు. 

Updated Date - 2020-06-26T09:46:43+05:30 IST