మూడో రోజూ కొనసాగిన పేర్ల నమోదు

ABN , First Publish Date - 2020-05-08T09:01:10+05:30 IST

వలస కార్మికుల రిజిస్ర్టేషన్ల ప్రక్రియ మూడోరోజూ కొనసాగింది. కార్మికులు, కూలీల సంఖ్య రోజు

మూడో రోజూ కొనసాగిన పేర్ల నమోదు

నగరంలోని పలు కేంద్రాలకు అధిక సంఖ్యలో వలస కూలీలు


కుత్బుల్లాపూర్‌/ఖైరతాబాద్‌/బేగంపేట/పద్మారావునగర్‌/తిరుమలగిరి/మెహిదీపట్నం /మియాపూర్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): వలస కార్మికుల రిజిస్ర్టేషన్ల ప్రక్రియ మూడోరోజూ కొనసాగింది. కార్మికులు, కూలీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కూలీలు సమీపంలోని పోలీ్‌సస్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వివరాలను నమోదు చేసుకుంటున్నారు.


గురువారం వరకు ఆయా పోలీ్‌సస్టేషన్ల పరిధుల్లో వలస కూలీలు అధిక సంఖ్యలో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. పేట్‌బషీరాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో దూలపల్లి కమ్యూనిటీ హాల్‌, కొంపల్లి పీఎ్‌సఆర్‌ కన్వెన్షన్‌, వెంకటేశ్వర గార్డెన్‌, జీడిమెట్ల సరోజినీ గార్డెన్‌, జీఎంఆర్‌ క్లబ్‌లో వలస కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారు. మూడు రోజులుగా 1800 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. బాచుపల్లి పీఎస్‌ పరిధిలో సుమారు 500, దుండిగల్‌లో 900 కూలీలు చేరుకోగా, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో పేర్లు నమోదు కొనసాగుతోంది. పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 4 వేలు, బంజారాహిల్స్‌లో 1,232, జూబ్లీహిల్స్‌లో 512, సనత్‌నగర్‌లో సుమారు 10 మంది, ఎస్సార్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 79 మంది, బేగంపేటలో సుమారు 77 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఖైరతాబాద్‌ గ్రంథాలయం వద్ద 92 మంది పేర్లు నమోదు చేనుకోగా చింతలబస్తీలోని కేంద్రం వద్ద 85 మంది నమోదు చేసుకున్నారు. 


ఈ పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటివరకు 2,500 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. ఒడిశాకు చెందిన 25 మంది, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన  ఐదుగురు వలస కూలీలు తిరుమలగిరి చౌరస్తా నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి పేర్లు నమోదు చేసుకున్నారు. స్వస్థలాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూబోయిగూడ ముదిరాజ్‌ భవన్‌లో, కవాడిగూడలోని ముగ్గు బస్తీలో, లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని నాయుడు కళాశాలలో వలస కార్మికుల పేర్లు నమోదు చేస్తున్నారు. వారిని స్వస్థలాలకు పంపించడానికి పాస్‌లు జారీ చేస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో 900 మందికి పాస్‌లు జారీ చేసినట్టు గాంధీనగర్‌ ఎస్‌ఐ మల్లేష్‌ తెలిపారు. గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఓ ఫంక్షన్‌హాల్లో భౌతిక దూరం పాటిస్తూ వలస కూలీల పేర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


భోజనాలు ఏర్పాటు చేయలేక ఇబ్బందులు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా.. రాయదుర్గం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో దాదాపు 10వేల మందికి పైగా స్వస్థలాలకు వెళ్లేందుకు పాస్‌ల కోసం నమోదు చేసుకున్నట్లు తెలిసింది. మియాపూర్‌, చందానగర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్‌ ప్రాంతాల్లో దాదాపు 10వేల నుంచి 12వేల మంది పాస్‌ల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిని డీసీఎంలు, బస్సుల ద్వారా రైల్వేస్టేషన్లకు తరలిస్తున్నారు. ఫంక్షన్‌హాళ్లలో వలస కూలీలకు భోజన ఏర్పాట్లు చేయలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నపూర్ణ పేర్లు నమోదు చేయించుకునేందుకు వచ్చిన వలస కూలీలకు కేంద్రాల్లో, దాతల సహకారంతో పోలీసులు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. 


Updated Date - 2020-05-08T09:01:10+05:30 IST