స్తబ్దత!
ABN , First Publish Date - 2020-05-17T11:07:47+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో మహానగర నిర్మాణ రంగంలో స్తబ్దత ఏర్పడింది. 50 రోజులుగా జీహెచ్‌ఎంసీకి భవన నిర్మాణ అనుమతుల

నిర్మాణ రంగంలో అనిశ్చితి
జీహెచ్‌ఎంసీకి తగ్గిన దరఖాస్తులు
50 రోజులుగా పది శాతంలోపే...
గణనీయంగా తగ్గిన సంస్థ ఆదాయం
హైదరాబాద్ సిటీ, మే 16 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ నేపథ్యంలో మహానగర నిర్మాణ రంగంలో స్తబ్దత ఏర్పడింది. 50 రోజులుగా జీహెచ్‌ఎంసీకి భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. మొన్నటి వరకు కార్యాలయాల్లో సందర్శకులకు అనుమతి లేకపోవడం.. ఆర్కిటెక్ట్‌లు, స్ట్రక్చరల్ ఇంజనీర్ల ఆఫీ్‌సలు, ఇతరత్రా సంస్థలు, దుకాణాలు మూసి ఉండడంతో కొత్తగా దరఖాస్తు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. అంతకు ముందుతో పోలిస్తే 10 శాతం దరఖాస్తులు కూడా రాలేదని పట్టణ ప్రణాళికా విభాగం అధికారొకరు తెలిపారు. గ్రేటర్‌లోని ఐదు జోన్లు, 30 సర్కిళ్లతోపాటు ప్రధాన కార్యాలయానికి వివిధ కేటగిరీల భవనాల కోసం సగటున నెలకు 1200 నుంచి 1300 దరఖాస్తులు వచ్చేవి. నెలన్నరగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య 150కి మించలేదని ఓ అధికారి చెప్పారు.
ఆచి తూచి...
లాక్‌డౌన్‌కు ముందు చేసిన దరఖాస్తుదారులు కొందరికి రుసుము చెల్లించాలని(ఫీ ఇంటిమేషన్ లెటర్) అధికారులు సమాచారమిచ్చారు. వారిలో కొందరు ఫీజు చెల్లించేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కరోనా వేళ మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని అయోమయం నెలకొన్న నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం అంత శ్రేయస్కరమా? అన్న ఆలోచనలో పలు నిర్మాణ సంస్థలు ఉన్నట్టు సమాచారం. మరి కొందరు మాత్రం ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
లాక్‌డౌన్ ఆంక్షల సడ లింపు నేపథ్యంలో గత వారం రోజుల్లో ఐదారుగురు ఫీజు చెల్లించారని ఓ అధికారి చెప్పారు. నీటి సరఫరాకు సంబంధించి వాటర్ బోర్డు నుంచి వాటర్ ఫీజిబులిటీ సర్టిఫికెట్, పోలీసుల నుంచి ట్రాఫిక్ ఎన్‌ఓసీ తీసుకురావాలి. రుసుము చెల్లించిన అనంతరం బడా ప్రాజెక్టుల్లో 10 శాతం నిర్మాణ విస్తీర్ణాన్ని జీహెచ్‌ఎంసీ పేరిట మార్ట్‌గేజ్ చేయాల్సి ఉంటుంది. మొన్నటి వరకు రిజిస్ర్టేషన్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో మార్ట్‌గేజ్ చేసే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం రిజిస్ర్టేషన్ శాఖ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఫీజు చెల్లించినవారు మార్ట్‌గేజ్ చేయిస్తున్నారని సిటీ ప్లానర్ ఒకరు తెలిపారు. మార్ట్‌గేజ్ పూర్తయ్యాక భవన నిర్మాణాలకు సంబంధించి ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పారు. సడలింపులు ఇస్తోన్న నేపథ్యంలో మునుపటిలానే నిర్మాణ దరఖాస్తులు వస్తాయని, ఇప్పటికే దరఖాస్తు చేసిన వారూ పర్మిషన్ తీసుకుంటారని పేర్కొన్నారు.
తగ్గుతోన్న ఆదాయం.. ఆందోళన...
భవన నిర్మాణ అనుమతుల ద్వారా యేటా జీహెచ్‌ఎంసీకి రూ.800 నుంచి 850 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఆస్తిపన్ను తరువాత ఎక్కువ ఆదాయం వచ్చేది పట్టణ ప్రణాళికా విభాగం ద్వారానే. 2020-21 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే టౌన్‌ప్లానింగ్‌కు కరోనా రూపంలో పెద్ద దెబ్బ పడింది. వాస్తవంగా నిర్మాణ రంగానికి వేసవి మంచి సీజన్. కొత్త ప్రాజెక్టులు ఈ సమయంలోనే ప్రారంభిస్తుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. బడా ప్రాజెక్టులతోపాటు సొంత ఇళ్లు నిర్మించుకునేవారు సైతం వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. ఆశించిన స్థాయిలో ఆస్తిపన్ను వసూలు కాని సంస్థకు.. పట్టణ ప్రణాళికా విభాగం ఆదాయం తగ్గడం మరింత ఆర్థిక భారంగా మారనుంది. వేతనాలు, బకాయిలు చెల్లించడం ఎలా? అని ప్రతి నెలా ఖజానా చూసుకునే జీహెచ్‌ఎంసీకి అన్ని విభాగాల నుంచి ఆదాయం తగ్గుతుండడం ఆందోళనకరమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ లెక్క..
యేటా భవన నిర్మాణ అనుమతులు - 15000-16000
వచ్చే ఆదాయం - రూ. 800 - 850కోట్లు
నెలకు సగటున - 1200-1300లకుపైగా
గత 50 రోజులుగా వచ్చిన దరఖాస్తులు - 150లోపు