ఊరికి పోవాలి
ABN , First Publish Date - 2020-04-28T11:00:49+05:30 IST
కన్న ఊరు రమ్మంటున్నా.. ఆకలి ఆగమంటోంది. ఇదీ శివారుల్లో ఉన్న వలస కూలీల బతుకు చిత్రం.

అందిన వారే మళ్లీ సాయం కోసం..
అవసరం ఉన్న కొందరికి ఇంకా అందని సరుకులు
అధికారులు నిశిత పరిశీలన చేయాల్సిన అవసరం
మియాపూర్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): కన్న ఊరు రమ్మంటున్నా.. ఆకలి ఆగమంటోంది. ఇదీ శివారుల్లో ఉన్న వలస కూలీల బతుకు చిత్రం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్నదాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బియ్యం, డబ్బు పంపిణీ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. చంటి పిల్లలను ఎత్తుకొని వెళ్లి పడిగాపులు పడుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వలస కూలీలు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ చేతి వృత్థులు, చిరు వ్యాపారులు పలు రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. కరోనా ఎఫెక్ట్‌తో వలస కూలీల బతుకులు బారంగా మారాయి.
బియ్యం కోసం తోపులాట
రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఆధారంగా వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500 పంపిణీ చేస్తోంది. రెండు విడతల్లో స్థానికంగా 13 వేల మందికి బియ్యం, నగదు పంపిణీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనూ కొన్నివేల మందికి బియ్యం పంపిణీ చేశారు. ప్రతిరోజూ పంపిణీ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఒక కేంద్రం వద్ద వెయ్యి మందికి ముందుగానే టోకెన్లు ఇచ్చి పంపిణీ చేస్తున్నప్పటికీ 1500 నుంచి రెండు వేలమంది క్యూలో ఉంటున్నారు. బియ్యం అందుతాయో లేదోనని తోసుకుంటూ భౌతిక దూరం పాటించడం లేదు. తీసుకున్న వారే మరలా క్యూలో నిలబడుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
నెలరోజులుగా పంపిటణీ చేస్తున్నా...
ఇప్పటికే గుర్తించిన వారికి 75 నుంచి 80 శాతం పంపిణీ పూర్తయినప్పటికీ గుర్తించని వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కూలీలు చెబుతున్నారు.
నెల రోజుల నుంచి లాక్‌డౌన్‌తో వలస కూలీల ఉపాధి దెబ్బతింది. పనులు లేక పస్తులుంటున్నామని ప్రకాశం జిల్లాకు చెందిన దుర్గ కుటుంబ సభ్యులు తెలిపారు. ఊళ్లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్దామని కార్మికులు అర్ధరాత్రి, తెల్లవారు జామున బయలుదేరుతుంటే పోలీసులు ఆపి వారిని వెనక్కి పంపిస్తున్నారు. ఈ పరిస్థితి మియాపూర్, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం ప్రాంతాల్లో ఉన్నట్లు కొంతమంది పోలీసు అధికారులు తెలిపారు.
భవన నిర్మాణ యాజమాన్యాలు నిత్యావసరాలు అందించి ఆహారం పెడుతున్నప్పటికీ తల్లిదండ్రులు, బంధువులు గుర్తుకొచ్చి, ఇక్కడి పరిస్థితులు చూసి తట్టుకోలేక కాలి నడకన వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, వాచ్‌మెన్‌ల ద్వారా సమాచారం అందుకుంటున్న పోలీసులు వారిని వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వివిధ రంగా ల్లో పనిచేసే కార్మికులు, కూలీలు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరందరినీ గుర్తించడం కష్టమైనప్పటికీ ప్రతిరోజూ రోడ్డుపైకి గుంపులు గుంపులుగా వచ్చి భౌతిక దూరం పాటించకుండా సహాయం కోసం నిలబడడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.