టార్గెట్.. బిల్లు వసూళ్లు..!
ABN , First Publish Date - 2020-06-11T10:47:52+05:30 IST
లాక్‌డౌన్ సడలింపులతో విద్యుత్ శాఖ సిబ్బంది మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో మార్చి, ఏప్రిల్

ముగిసిన విద్యుత్ బిల్లుల రీడింగ్
పెండింగ్‌లో గత 2 నెలల బిల్లులు
హైదరాబాద్ సిటీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ సడలింపులతో విద్యుత్ శాఖ సిబ్బంది మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన బిల్లులను విద్యుత్ శాఖ వినియోగదారులకు అందించలేకపోయింది. జూన్ 2వ తేదీ నుంచి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మీటర్ రీడింగ్ తీసున్నారు. ప్రస్తుతం 3 నెలలు మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మీటర్ రీడింగ్ తీసి 91, 92 రోజులతో బిల్లులు జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియను జూన్ 10 నాటికి ముగించి, బిల్లుల వసూలపై దృష్టి పెట్టనున్నారు.
ఇప్పటి వరకు, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన బిల్లులు 2019 మార్చి, ఏప్రిల్‌లో వచ్చిన బిల్లులను ఫోన్ ద్వారా పంపించి, వాటిని చెల్లించాలని అధికారులు సూచించారు. బిల్లులు ఎక్కువగా ఉండడం, కేవలం ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉండడంతో 50-60 శాతం బిల్లులు వసూలయ్యాయి. తాజాగా జూన్ మొదటి వారం నుంచి 3నెలల బిల్లులు జారీ చేసి, వసూళ్లు పూర్తి స్థాయిలో చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 56.41 లక్షల విద్యుత్ కనెక్షన్‌లు ఉండగా, ఇందులో గృహ వినియోగదారులు 46 లక్షలు, 7.3లక్షలు వ్యాపార, వాణిజ్య కనెక్షన్‌లు ఉన్నాయి. సుమారు ప్రతి నెలా రూ.1200 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వసూలు కావాల్సి ఉంటుంది.
బిల్లులపై ఆందోళన..
మూడు నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ఒకేసారి జారీ చేయడం వల్ల అధిక మొత్తంలో బిల్లులు వచ్చాయంటూ గ్రేటర్ పరిధిలో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము ఎక్కువ మొత్తంలో వచ్చిన బిల్లులను చెల్లించేదేలా అంటూ మండిపడుతున్నారు. లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లల్లో ఉండడం వల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని, అందుకే బిల్లులు ఎక్కువ వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈనెల 22వ తేదీ నాటికి బిల్లులు వసూలు చేసే లక్ష్యంతో సిబ్బంది పని చేస్తున్నారు.
డిగ్రీ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరాంవెంకటేశ్వర్లు తెలిపారు. మొదట జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 10వ తేదితో గడువు ముగియడంతో కరోనా ఇబ్బందుల దృష్ట్యా పలు వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు చెల్లించిన ఫీజులను కళాశాల యాజమన్యాలు మాత్రం ఈనెల 12లోగా వర్సిటీకి చెల్లించాలని వెల్లడించారు.