చైతన్యకు మొక్క అందిస్తున్న బాలకృష్ణ
ABN , First Publish Date - 2020-10-21T11:06:05+05:30 IST
ఓ వైపు కేన్సర్...మరో వైపు కొవిడ్.... ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రోగికి ఇండో అమెరికన్ బసవతారకం కేన్సర్ ఆస్పత్రి బాసటగా నిలిచింది

కేన్సర్ రోగికి ఉచితంగా అరుదైన చికిత్స
బాసటగా నిలిచిన బసవతారకం ఆస్పత్రి
వైద్యులను అభినందించిన నందమూరి బాలకృష్ణ
బంజారాహిల్స్, అక్టోబర్ 20(ఆంధ్రజ్యోతి): ఓ వైపు కేన్సర్...మరో వైపు కొవిడ్.... ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రోగికి ఇండో అమెరికన్ బసవతారకం కేన్సర్ ఆస్పత్రి బాసటగా నిలిచింది. వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి రోగిని కాపాడారు. ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన చైతన్యకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది. కేన్సర్ కణితితో బాధితురాలి ఆరోగ్యం క్షీణిస్తోంది. విషయం తెలుసుకున్న ఇండో అమెరికన్ బసవతారకం ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఉచితంగా వైద్య చికిత్స అందించేందుకు ముందుకొచ్చారు. ఆమెను ఆస్పత్రి లో చేర్చుకొని పరీక్షించగా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో మూడు వారాల పా టు ఐసోలేషన్‌లో ఉంచి కేన్సర్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
కొవిడ్ నెగెటివ్ రావడంతో డాక్టర్ సీకేనాయుడు, ఎనస్థీషియా వైద్యుడు బసంత్‌కుమార్ నేతృత్వంలో వైద్య బృందం కణితిని తొలగించింది. కోలుకున్న రోగిని మంగళవా రం డిశ్చార్జ్ చేశారు. చైతన్యను బాలకృష్ణ పరామర్శించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వైద్యులను అభినందించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ పేద వారికి వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో తన తండ్రి ఎన్టీఆర్ ఆస్పత్రిని స్థాపించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల మేరకే రూ.15 లక్షలు విలువగల చికిత్సను ఉచితంగా అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ఆర్వీ ప్రభాకర్‌రావు, మెడికల్ డైరెక్టర్ టీఎస్ రావు, సీఓఓ జి. రవికుమార్, మెడికల్ సూపరింటెండెంట్ ఫణి కోటేశ్వరరావు పాల్గొన్నారు.