12 పర్సెంట్‌ తగ్గిన క్రైమ్‌..!

ABN , First Publish Date - 2020-12-29T06:47:03+05:30 IST

గతేడాదితో పోల్చితే..

12 పర్సెంట్‌ తగ్గిన క్రైమ్‌..!


200 శాతం పెరిగిన సైబర్‌ నేరాలు

మహిళలపై హింస 11 శాతం పెరుగుదల

ఐటీ సెల్‌ పనితీరు అద్భుతం 

ఆన్‌లైన్‌ ఫిర్యాదులకు తక్షణ స్పందన

2020లో 4,926 ఫిర్యాదులు

వార్షిక నివేదిక విడుదల చేసిన రాచకొండ సీపీ


‘‘రాచకొండలో సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. స్మార్ట్‌ పోలీసింగ్‌తో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. విత్‌ యూ.. ఫర్‌ యూ నినాదంతో సిబ్బంది పని చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి సమాచారం తెలియజేయాలన్నా, ఫిర్యాదులు ఉన్నా డయల్‌-100తో పాటు.. రాచకొండ వాట్సాప్‌ నంబర్‌ 9490617111తో పాటు.. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో తెలియజేయండి.’’ 

- మహేష్‌ మురళీధర్‌ భగవత్‌, రాచకొండ సీపీ.


హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి) : గతేడాదితో పోల్చితే.. రాచకొండ కమిషనరేట్‌లో క్రైమ్‌ రేట్‌ 12 శాతం తగ్గిందని, సైబర్‌ క్రైమ్‌ మాత్రం 200 శాతం పెరిగిందని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. నాగోల్‌లోని దేవికా కన్వెన్షన్‌లో సోమవారం రాచకొండ కమిషనరేట్‌ వార్షిక క్రైమ్‌ నివేదికను సీపీ, అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, ఇతర డీసీపీలతో కలిసి విడుదల చేశారు. 2019లో 23,127 కేసులు నమోదు కాగా.. 2020లో 20,641 కేసులు నమోదైనట్లు సీపీ వెల్లడించారు. అలాగే 2020లో 4,926 ఆన్‌లైన్‌ ఫిర్యాదులు వచ్చాయని, ప్రతి ఫిర్యాదునూ ఐటీ సెల్‌ మానిటరింగ్‌ చేసి, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని సీపీ తెలిపారు. 


రాచకొండ కమిషనరేట్‌ పోలీస్‌ సిబ్బంది శక్తివంచన లేకుండా సమన్వయంతో, అహర్నిశలు పని చేశారు. కరోనా కష్టాల్లో, వరదల సమయంలో ప్రజల వెన్నంటే పోలీసులు ఉండి అత్యవసర సేవలు అందించారు. మేమున్నాం అనే భరోసా కల్పించారు. 


గతేడాదితో పోల్చితే మర్డర్‌లు తగ్గాయి. 2019లో 86 హత్యలు నమోదు కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 59 మాత్రమే. మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. 2019లో 277 అత్యాచార ఘటనలు జరగగా.. ఈ ఏడాది 329 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 


‘‘గతేడాదితో పోల్చితే దోపిడీలు, దొంగతనాల ద్వారా చోరీకి గురైన సొత్తులో రికవరీ మూడు శాతం పెరిగింది. 2019లో దోపీడీకి గురైన సొత్తు రూ. 17,77,87,780 కాగా.. రికవరీ రూ. 9,13,85,498. అంటే 50 శాతం. 2020లో దోపిడీకి గురైన సొత్తు రూ. 15,19,20,523 కాగా.. రికవరీ రూ. 8,08,00185. అంటే 53 శాతం.


సైబర్‌ యోధ

కొత్తపేట, డిసెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి) : సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ  సైబర్‌ యోధా లోగో, పోస్టర్‌లను సీపీ ఆవిష్కరించారు. రాచకొండ పోలీస్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఆర్‌పీఎస్‌సీ), ఎండ్‌ నౌ ఫౌండేషన్‌తో కలిసి రాచకొండ కమిషనరేట్‌ రాష్ట్రంలో మొట్టమొదటి సారి సైబర్‌ యోధా ప్రత్యేక ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు. ప్రాజెక్టులో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరులూ భాగస్వాములవ్వవచ్చని, తొలుత వారికి సైబర్‌ చట్టాలు, డిజిటల్‌ సేఫ్టీ, సోషల్‌ ఇంజనీరింగ్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు, ఇంటర్‌నెట్‌ నైతికత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. విద్యా సంస్థల్లోనూ శిక్షణ, సర్టిఫికెట్లు, అవార్డులు, పతకాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ సీపీ సుధీర్‌బాబు, ఎల్‌బీనగర్‌, మల్కాజిగిరి, భువనగిరి డీసీపీలు సన్‌ప్రీత్‌ సింగ్‌, రక్షితామూర్తి, నారాయణరెడ్డి, యాదరిగి, అదనపు డీసీపీలు సలీమా, శ్రీనివాస్‌, ఏసీపీ సైబర్‌ క్రైమ్స్‌ హరినాథ్‌,  ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అనిల్‌ రాచమల్ల తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T06:47:03+05:30 IST