హైదరాబాద్ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో దారుణం.. నర్సులను నిర్బంధించి..

ABN , First Publish Date - 2020-07-19T18:26:28+05:30 IST

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులు దీన్నే అదనుగా

హైదరాబాద్ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో దారుణం.. నర్సులను నిర్బంధించి..

హైదరాబాద్ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులు దీన్నే అదనుగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆస్పత్రికి సంబంధించిన వార్తలను మనం చూస్తూనే ఉంటాం. తాజాగా.. ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. నిజంగా ఈ ఘటన గురించి విన్నాక ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు ఎందుకిలా తయారయ్యాయని ఛీ కొడతారు.! కరోనా సోకిన వారు ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తునే స్టాఫ్ కావాల్సి ఉంటుంది. కొందరు నర్సులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మరీ డ్యూటీలు చేయించుకోవడం గమనార్హం.


ఎందుకిలా..!?

పూర్తి వివరాల్లోకెళితే.. తమిళనాడు నుంచి వచ్చిన నర్సులను నిర్బంధించిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ వార్డుల్లో డ్యూటీలు చేయిస్తోంది. నర్సులు లబోదిబో అని మొత్తుకుంటున్నా జీతాలు ఇవ్వమని.. డ్యూటీ చేస్తేనే సరే లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని మరీ హెచ్చరించి డ్యూటీలు చేయించుకోవడం గమనార్హం. ఈ దారుణ ఘటన మెహిదీపట్నంలోని ఆలివ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి వచ్చిన నర్సులను, నిర్బంధించి మరీ వారితో పనులు చేయిస్తున్నారు. కరోనా వేళ నగరంలో పలు ఆస్పత్రులు ఇలా కక్కుర్తి పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకొని స్వగ్రామాలకు వెళ్లేలా చూడాలని తమిళనాడు నర్సులు వేడుకుంటున్నారు. అంతేకాకుండా తెలంగాణా నర్సింగ్ సమితికి కూడా నర్సులు లేఖ రాశారు. ఇప్పటికే ఇదే ఆస్పత్రిలో కోవిడ్ వార్డుల్లో పనిచేసే ఎంతో మంది నర్సులకు కరోనా సోకింది. వారిని యాజమాన్యం సరిగ్గా పట్టించుకున్నా పాపాన పోలేదు. 


డ్యూటీకి రావాల్సిందే..

అంతేకాదు.. తమకు కరోనా లక్షణాలున్నాయని డ్యూటీలకు రాలేమని దండం పెట్టి వేడుకుంటున్నా వచ్చి తీరాల్సిందేనని ఫోన్‌లు చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నాయని నర్సులు చెబుతున్నారు. విధులకు రాలేమని పదే పదే చెబుతున్నప్పటికీ ప్యారాసిటీమాల్ టాబ్లెట్ వేసుకుని డ్యూటీలకు రావాల్సిందేనని ఆస్పత్రి యాజమాన్యం చెబుతుండటం గమనార్హం. డ్యూటీలు చేయకపోతే, నర్సులకు రావాల్సిన జీతాలు ఇచ్చేది లేదని ఆలివ్‌తో పాటు పలు ఆస్పత్రుల యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. దీంతో నర్సులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నర్సులకూ ఈ తిప్పలు తిప్పట్లేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. ఆస్పత్రి యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా ఈ విషయం తెలుసుకున్న నర్సుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే చొరవచూపి తమ పిల్లలను ఇంటికి చేర్చేలా చూడాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2020-07-19T18:26:28+05:30 IST