ఇళ్లల్లోనూ నీళ్లే.. కళ్లల్లోనూ నీళ్లే.. హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి..!

ABN , First Publish Date - 2020-10-19T20:57:43+05:30 IST

ముంపు కష్టాలు మహానగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు ఆరు రోజులుగా వణుకుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయా ఇళ్లల్లో వరద నీరు నిలబడే ఉంది. నిత్యావసరాలు, వస్త్రాలు కొట్టుకుపోయి.. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి దుస్తులు లేక తడిచిన వాటితోనే చలికి వణుకుతున్నారు.

ఇళ్లల్లోనూ నీళ్లే.. కళ్లల్లోనూ నీళ్లే.. హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి..!

ముంపు ప్రాంతాల్లో నేటికీ అదే దుస్థితి

ఇంకా జలదిగ్బంధంలోనే వందలాది కాలనీలు

కొన్ని ఇళ్లు ఖాళీ

కట్టుబట్టలతో బంధువుల ఇళ్లకు పయనం

పాతబస్తీలో భయం భయం

ఆరు రోజులుగా ఇళ్లలోనే బందీలుగా


హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ముంపు కష్టాలు మహానగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు ఆరు రోజులుగా వణుకుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయా ఇళ్లల్లో వరద నీరు నిలబడే ఉంది. నిత్యావసరాలు, వస్త్రాలు కొట్టుకుపోయి.. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి దుస్తులు లేక తడిచిన వాటితోనే చలికి వణుకుతున్నారు. బయట అడుగుపెట్టే పరిస్థితి లేక.. ఇంట్లో ఉండలేక ఇంకెన్ని రోజులురా దేవుడా ఈ బాధలు అంటూ బోరుమంటున్నారు. కాస్త నీరు తగ్గి బయటకు వెళ్లే అవకాశం దక్కినవారు బతుకుజీవుడా అంటూ బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు.


సర్వం కోల్పోయాం.. ఊరికి పోతున్నాం.. 

హయత్‌నగర్‌ డివిజన్‌లోని బంజారాకాలనీ, సుధీర్‌కుమార్‌కాలనీ, రంగనాయకుల గుట్ట, క ట్టమైసమ్మ కాలనీ, పద్మావతి కాలనీ, ఆర్‌టీసీ కాలనీ ఐదు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరదల్లో సర్వం కోల్పోయిన రంగనాయకుల గుట్ట వాసులు శివాలయం వద్ద ఆశ్రయం పొందుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పలువురు నేతలు అందించిన ఆహారంతో కాలం వెళ్లదీస్తున్నారు. నిత్యావసరాలు, వస్త్రాలు, ఆటోలు, బైకులు, సైకిళ్లు మొత్తం కొట్టుకు పోవడంతో ధీనంగా కూర్చుని రోదిస్తున్నారు. బంజారాకాలనీకి శంకర్‌ గత సోమవారం తెచ్చుకున్న నాలుగు క్వింటాళ్ల బియ్యం నీటిపాలైంది. సర్వం కోల్పోవడంతో ఊరిబాట పట్టారు. 


ఐదు రోజులుగా రోడ్డుపై పడుకుంటున్నా: అంజమ్మ 

రంగనాయకుల గుట్ట కాలనీ వద్ద రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నా.  దాచుకున్న కాస్త డబ్బు, నిత్యావసరాలు వరదలకు కొట్టుకుపోయాయి. ఐదు రోజులుగా రోడ్డుపై పడుకుంటున్నా. 


ఎవరూ పట్టించుకోవడం లేదు..: నారాయణ, రంగనాయకుల గుట్ట కాలనీ 

రంగనాయకుల గుట్ట దేవుడి గుడి వద్దనే చాలా మంది బాధితులు తలదాచుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. సుధీర్‌ స్వచ్ఛంద సంస్థ భోజనం పెడుతోంది. 


మీ ఇంటికొచ్చేస్తాం ప్లీజ్‌!.. బంధువులకు ముంపు బాధితుల ఫోన్లు

 ‘‘భారీ వర్షాలకు ఐదు రోజులుగా వరద ముంపులోనే ఉన్నాం. తినడానికి తిండి సరిగా లేదు. కరెంటు సరఫరా లేదు. ఇక ఇక్కడ ఉండలేకపోతున్నాం. మీ ఇంటికి రావాలనుకుంటున్నాం.’’ అంటూ బంధువులు, తెలిసిన వారికి  బాధితులు ఫోన్లు చేస్తున్నారు. వందల సంఖ్యలో ప్రజలు వరద నీటి కష్టాలకు దూరంగా వెళ్లాలని  ప్రయత్నాలు చేస్తున్నారు. తమ బంధువులకు, తెలిసిన వారికి ఫోన్లు చేసి తమ బాధను దీనంగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఉండే కన్నా బంధువులు, తెలిసిన వారి ఇంటికి వెళ్తేనే బాగుంటుందనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారం మరింత ఆందోళన కలిగిస్తుండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వారం పది రోజుల పాటు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అనే నిర్ణయానికి వచ్చి, బయటకు వెళ్లిపోతున్నారు.


కార్ల పార్కింగ్‌ కోసం వెతుకులాట

ముంపు ప్రాంతాల్లోని బాధితులు లక్షలు విలువ చేసే ఇంటి సామగ్రితో పాటు వాహనాలు వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తమ కార్లను సురక్షితంగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసేందుకు వెతుకుతున్నారు. వరద నీటికి కారు పాడైతే మరమ్మతులు చేయించేందుకు మళ్లీ రూ.50 వేల నుంచి లక్షకు పైగానే ఖర్చయ్యే అవకాశం ఉండడంతో చాలా మంది కారును సురక్షిత ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


జలదిగ్బంధంలో అమర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ

భారీ వర్షాలకు ఐటీ కారిడార్‌, మాదాపూర్‌, దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలోని అమర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ, కావూరిహిల్స్‌, నెక్టర్‌గార్డెన్‌, అంజనీనగర్‌తో పాటు ఖానామెట్‌ వీకర్‌ సెక్షన్‌ పూర్తిగా జలమయం అయ్యాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి డాక్టర్స్‌ కాలనీ, నెక్టార్‌గార్డెన్‌ చెరువుగా మారాయి. అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో నివాసం ఉండే 25 మంది తమ ఇళ్లను ఖాళీచేసి వేరే ప్రాంతాలకు వెళ్లారు. నీరు, సరైన తిండి లేక ఇళ్లల్లో ఉంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి వరకూ ఇక్కడకు రాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఆవేదన.. ఆగ్రహం.. బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా

పీర్జాదిగూడ, బోడుప్పల్‌ కార్పొరేషన్ల పరిధిలోని అనేక గ్రామాలు ఇంకా వరదలోనే ఉన్నాయి. కొందరు ఇళ్లు ఖాళీ చేసి బంధువుల, స్నేహితుల ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు పై అంతస్తుల్లోనే ఉంటున్నారు. మేడిపల్లి సుమా రెసిడెన్సీలో దాదాపు 150 ఇళ్లు నీట మునిగాయి. వరద ముంపుతో ఒక్కొక్కరి ఇళ్లలో లక్షలాది రూపాయల విలువ చేసే సామగ్రి, నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో ఆవేదన చెందుతున్న బాధితులు తమను ఆదుకోవడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు.


పాతబస్తీ అతలాకుతలం.. 

ఆగినట్టే ఆగి శనివారం సాయంత్రం మరోసారి కురిసిన భారీ వర్షానికి పాతబస్తీ అతలాకుతలమైంది. వారం రోజులుగా నానా అవస్థలు పడుతున్న బస్తీవాసులు ఎలాగోలా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇళ్లు వదిలి వేర్వేరు ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కాస్త తేరుకుందామనే సరికి తిరిగి వర్షం రావడం మామూలై పోయింది. మరోసారి వర్షం కురవడంతో ఆయా ప్రాంతాల జనం నిరాశతో బంధుమిత్రుల ఇళ్లల్లో... ఆశ్రయం కల్పించిన కేంద్రాల్లో సేద తీరుతున్నారు. గాజియె మిల్లత్‌, అల్‌జుబేల్‌ కాలనీ, హాషమాబాద్‌ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షం తీవ్రతతో ఇళ్లల్లోకి చేరిన నీరు తొలగిపోయి ఉంటుందని భావించి శనివారం చాలా మంది తిరిగి తమ ఇళ్లకు వచ్చే ప్రయత్నాలు చేశారు. తీరా వర్షం మళ్లీ ప్రారంభం కావడంతో ఆలోచన వాయిదా వేసుకున్నారు. 

Updated Date - 2020-10-19T20:57:43+05:30 IST