హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తే అవకాశం

ABN , First Publish Date - 2020-10-13T08:11:22+05:30 IST

జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌పదేళ్ల తర్వాత జలకళ సంతరించుకుంది.

హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తే అవకాశం

పదేళ్ల అనంతరం జలకళ

హైదరాబాద్‌ సిటీ/మెహిదీపట్నం, అక్టోబర్‌ 12 (ఆంధ్రజ్యోతి) : జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌పదేళ్ల తర్వాత జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరంతా హిమాయత్‌సాగర్‌కే చేరడంతో నిండుకుండలా మారింది. హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, సోమవారం సాయంత్రానికి 1762.00 అడుగులకు చేరింది.

రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.603 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో హిమాయత్‌సాగర్‌ పై భాగంలోని వికారాబాద్‌, చేవెళ్ల, షాబాద్‌ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వర్షాలు మొదలు కాగానే హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


పదేళ్ల తర్వాత...

2010 సంవత్సరంలో హిమాయత్‌సాగర్‌ ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం గణనీయంగా పెరిగింది. 2010లోనే హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తి దిగువకు నీళ్లను వదిలారు. హిమాయత్‌సాగర్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా ఔట్‌ఫ్లో కూడా అదేస్థాయిలో ఉండేవిధంగా గేట్లను అప్పట్లో ఎత్తారు. ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాల ప్రభావంతో హిమాయత్‌సాగర్‌కు జలకళ సంతరించుకుంది. సోమవారం రాత్రి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షంతో వరద నీరు చేరితే వెంటనే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. 


Updated Date - 2020-10-13T08:11:22+05:30 IST