కాంప్లెక్స్‌లో కలకలం.. ఒకరికి పాజిటివ్‌... 48 మందికి పరీక్షలు

ABN , First Publish Date - 2020-04-05T15:47:44+05:30 IST

అదొక రెసిడెన్సియల్‌ కాంప్లెక్స్‌... అందులో 9 కుటుంబాలకు చెందిన 48 మంది నివాసముంటున్నారు. అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

కాంప్లెక్స్‌లో కలకలం.. ఒకరికి పాజిటివ్‌... 48 మందికి పరీక్షలు

హిమాయత్‌నగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): అదొక రెసిడెన్సియల్‌ కాంప్లెక్స్‌... అందులో 9 కుటుంబాలకు చెందిన 48 మంది నివాసముంటున్నారు. అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నారాయణగూడ పరదాగేట్‌లోని ఓ కాంప్లెక్స్‌లో ఉండే ఆరుగురు మార్చి 12న ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. వారిని పోలీసులు నాలుగు రోజుల క్రితం క్వారంటైన్‌కు తరలించారు. వారి రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు. ఇందులో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. ఇంకో ఐదుగురి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. వైరస్‌ విస్తరించే ప్రమాదాన్ని నివారించడానికి వైద్య శాఖ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం నారాయణగూడ పోలీసులు, ఏఎంహెచ్‌ఏ హేమలత, గాంధీ వైద్యురాలు ప్రియాంక ఆ భవనం వద్దకు చేరుకున్నారు. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరందరినీ క్వారంటైన్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


పెరుగుతున్న కేసులు

హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు మూడు రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 22 కేసులు నమోదుఅయ్యాయి. దీంతో పాజిటివ్‌ బారిన పడ్డ వారి సంఖ్య 104కు చేరింది. శివారు ప్రాంతాలైన మేడ్చల్‌, రంగారెడ్డి కలిపితే 90 శాతం కేసులు గ్రేటర్‌లోనే నమోదు కావడం కలవరపెడుతున్న అంశం. వీరందరికి గాంధీ ఐసోలేటెడ్‌ వార్డులో చికిత్సను అందిస్తున్నారు. నగరం నుంచి 603 మందికిపైగా మర్కజ్‌  వెళ్లి వచ్చారు. అందులో అధిక మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.

Updated Date - 2020-04-05T15:47:44+05:30 IST