హాస్టళ్లలో రాజకీయం.. పొలిటికల్‌ నేతలతో ఫుల్‌

ABN , First Publish Date - 2020-11-27T18:44:15+05:30 IST

గతంలో విద్యార్థులు, ఉద్యోగులు మాత్రమే ఉండే పేయింగ్‌ గెస్ట్‌(పీజీ) హాస్టల్స్‌ గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల వసతి కేంద్రాలుగా మారాయి. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా మూతపడ్డ పీజీ హాస్టల్స్‌ అన్‌లాక్‌తో తెరుచుకొన్నప్పటికీ..

హాస్టళ్లలో రాజకీయం.. పొలిటికల్‌ నేతలతో ఫుల్‌

కూకట్‌పల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): గతంలో విద్యార్థులు, ఉద్యోగులు మాత్రమే ఉండే పేయింగ్‌ గెస్ట్‌(పీజీ) హాస్టల్స్‌ గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల వసతి కేంద్రాలుగా మారాయి. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా మూతపడ్డ పీజీ హాస్టల్స్‌ అన్‌లాక్‌తో తెరుచుకొన్నప్పటికీ.. పేయింగ్‌ గెస్ట్‌లు లేక ఇబ్బంది పడ్డ నిర్వాహకులకు గ్రేటర్‌ ఎన్నికలు ఊరటనిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రచార నిమిత్తం నగరానికి వచ్చి ఆయా ప్రాంతాల్లోని హాస్టల్స్‌లో ఉంటున్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీకాలనీ, హైదర్‌నగర్‌ ప్రాంతాల్లోని హాస్టల్స్‌లో  రాజకీయ పార్టీల కార్యకర్తలతో నిండిపోయాయి.


అన్ని వసతులు ఉండడంతోనే...

లాడ్జ్‌ల్లో కేవలం బస చేసే అవకాశం ఉండడం, భోజనం కోసం ఇతర హోటల్స్‌కు లేదా పార్టీ కార్యాలయాలకు వెళ్లి తినాల్సి వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు రూట్‌ మార్చారు. హాస్టల్స్‌లో ఉదయం టిఫిన్‌, రెం డు పూటలా భోజనం తిని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందుకు హాస్టల్స్‌ నిర్వాహకులు రోజుకు రూ. 500 చొప్పున తీసుకొని సదుపాయాలు కల్పిస్తున్నారు. 


ప్రధాన  నాయకులకు ఓయో రూంలు..

ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు మాత్రం ఆయా ప్రాంతాల్లోని ఓయో రూంల్లో ఉంటున్నారు. ఓయో లాడ్జ్‌ల్లో ఉండేందుకు ఖర్చు ఎక్కువ కావడంతో నాయకులకు మాత్రమే ఓయో గదులు కేటాయిస్తున్నారు. ముఖ్యనాయకులతోపాటు వచ్చిన ద్వితీయ శ్రేణినాయకులు, కార్యకర్తలకు తక్కువ ఖర్చు ఉండే హాస్టల్స్‌లో వసతి కల్పిస్తున్నారు.

Updated Date - 2020-11-27T18:44:15+05:30 IST