సంక్షోభ సమయంలోనూ సహకరించని కొందరు ‘కరోనా’ అనుమానితులు

ABN , First Publish Date - 2020-04-07T16:18:35+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా 300కి పైగా పాజిటివ్‌ కేసులు... అంతకు ఎన్నో రెట్లు మించి అనుమానితులు.. వారిని క్వారంటైన్‌లకు తరలింపు ప్రక్రియలో పోలీసులు, వైద్యాధికారులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇంతటి సంక్షోభ సమయంలోనూ కొందరు

సంక్షోభ సమయంలోనూ సహకరించని కొందరు ‘కరోనా’ అనుమానితులు

సవాళ్లతో సమరం.. వాటిని భరిస్తూనే విధుల నిర్వహణ

ప్రాణాలను పణంగా పెడుతూ పోలీసులు - వైద్యాధికారుల విధులు

అనుమానితుల తరలింపులో ఇబ్బందులు, వేధింపులు

వాటిని భరిస్తూనే విధుల నిర్వహణ


హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 300కి పైగా పాజిటివ్‌ కేసులు... అంతకు ఎన్నో రెట్లు మించి అనుమానితులు..  వారిని క్వారంటైన్‌లకు తరలింపు ప్రక్రియలో పోలీసులు, వైద్యాధికారులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇంతటి సంక్షోభ సమయంలోనూ కొందరు అనుమానితులు సహకరించడం లేదు. ఏదో రకంగా సమాచారం సేకరిస్తున్న అధికారులు, పోలీసులు వారి అడ్రస్‌లు గుర్తించి ఇళ్లకు చేరుకుని నచ్చచెప్పి క్వారంటైన్‌లకు తరలించాల్సి వస్తోంది. కొంతమంది అనుమనితులు రాకుండా నానా రభస చేస్తున్నారు. వెళ్లిన వారిని వేధిస్తున్నారు. వాటన్నింటినీ భరిస్తూ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 


పెరుగుతున్న అనుమానితులు

పాజిటివ్‌ కేసుల సంఖ్య వందల్లో ఉన్నప్పటికీ ప్రతి రోజూ భారీ సంఖ్యలో అనుమానితులను క్వారంటైన్‌లకు తరలిస్తున్నారు. వారిని నచ్చచెప్పి తీసుకెళ్లడం కత్తిమీద సాము లాంటిదే. ఆ సమయంలో పోలీసులు, అధికారులు పాటిస్తున్న సంయమనం అభినందనీయమే. కొన్ని సందర్భాల్లో అనుమానితులు పారిపోయే ప్రయత్నాలు చేయడం, ఇళ్లల్లోకి వెళ్లి దాక్కోవడం, కుటుంబీకులు కూడా మొండికేసి సహకరించకపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయినా... అనుమానితులను వాహనం ఎక్కించి క్వారంటైన్‌కు తరలించే వరకూ పోలీసులు వెనకడుగు వేయడం లేదు. పాజిటివ్‌ వచ్చిన రోగులు ఆస్పత్రుల నుంచి పారిపోకుండా, వైద్యులపై దాడులకు పాల్పడకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


వైరల్‌ వీడియోలతో అప్రమత్తం

ఇటీవల పెరిగిన వైరల్‌ వీడియోలతో వైద్య సిబ్బంది, పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. కొన్ని చోట్ల అనుమానితులు వైద్య సిబ్బందితో, పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినట్లు వార్తలు, వీడియోలు సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా మారుతున్నాయి. నగరంలో ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు ఎక్కువగా జరగకపోయినప్పటికీ పోలీసులు మాత్రం అనుమానితులను క్వారంటైన్‌కు పంపించే ప్రయత్నాల్లో ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. 

Read more