ప్రాణాలు కాపాడే శక్తి ఉంటుందనుకోలేదు

ABN , First Publish Date - 2020-08-11T09:52:02+05:30 IST

కరోనాను గెలిచిన యోధులు ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నారు.

ప్రాణాలు కాపాడే శక్తి ఉంటుందనుకోలేదు

ప్లాస్మా దానంతో ప్రాణాలు కాపాడుతున్న కరోనా యోధులు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : కరోనాను గెలిచిన యోధులు ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నారు. బాధితులకు పునర్జన్మ ఇస్తున్న ప్రాణమున్న దేవుళ్లుగా ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటి వారందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి కరోనా బాధితుల ప్రాణాలు కాపాడటానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. ఆయన పిలుపుతో ఎంతోమంది ముందుకు వస్తున్నారు.    


ప్లాస్మాదానానికి ప్రాణం పోసిన మొదటి హీరో

సైబరాబాద్‌ పొలీస్‌- సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో సీపీ సజ్జనార్‌ ప్రత్యేక కొవిడ్‌ కంట్రోల్‌ రూంతోపాటు.. డొనేట్‌ ప్లాస్మా డాట్‌ ఎస్సీఎస్సీ డాట్‌ ఇన్‌ అనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనాను ధైర్యంగా జయించడమే కాకుండా.. నాలో ఉన్న శక్తితో ఇతరుల ప్రాణాలు కాపాడతాను అని సీపీ పిలుపుతో ముందుకు వచ్చి మొదటిసారి ప్లాస్మా దానం చేశారు మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌. ఆయన బాటలో వందలాది మంది యువకులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చారు.. వస్తున్నారు.


ఆయన వల్ల రెండు ప్రాణాలు నిలబడటంతోపాటు.. రెండు కుటుంబాల్లో వెలుగులు నిండాయి. దాంతో ఇన్‌స్పెక్టర్‌ కుటుంబ సభ్యులు బంధువులు ఎంతో సంతోషించారు. అదే రెట్టించిన ఉత్సాహంతో మరోసారి ప్లాస్మా దానం చేసి మరో రెండు జీవితాలను కాపాడారు. ఒకసారి సీపీ సజ్జనార్‌, రెండోసారి మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ఘన సన్మాన్ని అందుకున్నారు.

- శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, మాదాపూర్‌


సంజీవిని వంటి శక్తి ఉంటుందనుకోలేదు

కరోనా బారిన పడినప్పుడు మిత్రులకు, చుట్టుపక్కల వారికి తెలియకూడదనుకున్నాను. ఎవరు ఏం అనుకుంటారో.. ఎలా చూస్తారో.. అని భయపడ్డాను. కరోనాను జయించి ప్రాణాలతో బయటపడితే చాలనుకున్నాను. కొద్ది రోజుల్లోనే కరోనా నుంచి బయటపడ్డాను. నాలో ఇతరులను కూడా కాపాడే ప్లాస్మా అనే శక్తి.. ప్రాణాలు నిలిపే సంజీవిని ఉంటుందనుకోలేదు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు. 

- వీరభద్రం, సబ్‌ఇన్‌స్పెక్టర్‌, మియాపూర్‌ (ట్రాఫిక్‌)


ప్లాస్మా దానం కోసం ఎదురు చూశా 

నాకు కరోనా వచ్చినప్పుడు నాతోపాటు.. మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు తెలిసిన వాళ్లు చాలా బాధపడ్డారు. నేను మాత్రం ఎంత త్వరగా కోలుకుంటానా.. ఎప్పుడు ప్లాస్మా దానం చేసి మరో ఇద్దరి ప్రాణాలు కాపాడాలా.. అని ఎదురు చూశాను. సీపీ సజ్జనార్‌ తలపెట్టిన కార్యక్రమంలో భాగస్వామిని కావాలనుకున్నాను. కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత నెల రోజులు ఆగాల్సి వచ్చింది. మరోసారి ప్లాస్మా దానం చేయడానికి సిద్ధం. 

- శ్రీనివాస్‌ రెడ్డి, టాటా క్యాపిటల్‌(కలెక్షన్‌) తెలంగాణ హెడ్‌

Updated Date - 2020-08-11T09:52:02+05:30 IST