ఇంటి ముంగిటకే..

ABN , First Publish Date - 2020-04-18T11:08:23+05:30 IST

జిల్లా పరిధిలోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందించేందుకు ఐసీడీఎస్‌ ప్రత్యేక

ఇంటి ముంగిటకే..

అంగన్‌వాడీ పోషకాహారం

15 రోజులకు సరిపడా సరుకులు 

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ

ఇప్పటి వరకు రెండు పర్యాయాలు 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందించేందుకు ఐసీడీఎస్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.  జిల్లా పరిధిలో చార్మినార్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, నాంపల్లి, సికింద్రాబాద్‌ జోన్లలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కేంద్రాలున్నాయి. ఇందులో చార్మినార్‌లో 257 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నా యి. గోల్కొండలో 154, ఖైరతాబాద్‌లో 141, నాంపల్లిలో 191, సికింద్రాబాద్‌లో 171 ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తం గా 914 సెంటర్లు పనిచేస్తున్నాయి.  ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా కొన్నేళ్ల నుంచి జిల్లా పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింత లు, 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు మన్నన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రోజూ ఉదయం పోషకాహారంతోపాటు మధ్యాహ్నం భోజనం అందించేవారు.


మూడేళ్ల లోపు పిల్లల ఇళ్లవద్దకే అంగన్‌వాడీ వర్కర్లు వెళ్లి బాలామృతం, కోడిగు డ్లు ఇచ్చి వచ్చేవారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమశాఖ అధికారులు టేక్‌ హోం రేషన్‌ (టీహెచ్‌ఆర్‌) కింద లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారు.


లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐసీడీఎస్‌ అధికారులు టేక్‌ హోం రేషన్‌ ద్వారా రెండు పర్యాయాలు లబ్ధిదారులకు సరుకులు అందజేశారు. తొలివిడతలో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 2 వరకు, రెండో దఫాలో ఏప్రిల్‌ 8 నుంచి 11 వరకు రెండుసార్లు నిత్యావసర వస్తువులు అందజేశారు.  15 రోజులకు సరిపడా సరుకులు ఇస్తున్నారు.   మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఇంటింటికి వెళ్లి వస్తువులను పంపిణీ చేస్తున్నారు.

Updated Date - 2020-04-18T11:08:23+05:30 IST