పెండింగ్‌ మెస్‌ బకాయిలు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-03-18T09:41:57+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న హాస్టల్‌ మెస్‌ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య బృందం మంగళవారం విజ్ఞప్తి చేసింది.

పెండింగ్‌ మెస్‌ బకాయిలు విడుదల చేయాలి

3 వేల హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి 

మంత్రి గంగుల కమలాకర్‌ను కోరిన ఆర్‌.కృష్ణయ్య 


రాంనగర్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న హాస్టల్‌ మెస్‌ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య బృందం మంగళవారం విజ్ఞప్తి చేసింది. 3వేల హాస్టల్స్‌ను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న 1200 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరింది. ఈ సందర్భంగా డిమాండ్ల పత్రాన్ని మంత్రికి అందజేసి పలు అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్‌.కృష్ణయ్య వెల్లడించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌కు గడిచిన సెప్టెంబర్‌ నుంచి ఇప్పటి వరకు బకాయిలు ఇవ్వకపోవడంతో హాస్టల్‌ యజమానులు భవనాలు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, దీని వల్ల విద్యార్ధులు రోడ్డున పడే ప్రమాదం ఉందని మంత్రికి వివరించినట్లు తెలిపారు.


విద్యార్థులకు సంబంధించిన 1200 కోట్ల ఫీజు బకాయిలు, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి 22 వేల కోట్లను విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు అప్పులు తెచ్చి వాటిని తిరిగి ఇవ్వలేక ఆత్మహత్యలకు గురికావాల్సి వస్తోందని మంత్రికి వివరించినట్లు తెలిపారు. కరెంట్‌ బిల్లులు కూడా గత ఆరు నెలలుగా చెల్లించడం లేదని, దీంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారని అన్నారు. గత ఆరు నెలల నుంచి కాస్మోటిక్‌ చార్జీలు చెల్లించడం లేదని, 10 నెలల నుంచి ట్యూటర్‌ బిల్లుకు బడ్జెట్‌ విడుదల చేయకపోవడం వల్ల ఇబ్బందులు నెలకొంటున్నాయని అన్నారు. తమ డిమాండ్లపై మంత్రి గంగుల కమలాకర్‌ సానుకూలంగా స్పందించారని, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే నిధుల విడుదలకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ ప్రతినిధులు గుజ్జ కృష్ణ, తాండూరి గోపీనాథ్‌, జి.కృష్ణకుర్మ, ఆర్‌.చంద్రశేఖర్‌, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-18T09:41:57+05:30 IST