మతం మారితే పెండ్లన్నారు..

ABN , First Publish Date - 2020-02-12T09:23:06+05:30 IST

మతం మారితేనే వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువతి, ఆమె తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ఓ యువకుడు చేసిన ఫిర్యాదుపై మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో విచారణ నిర్వహించారు.

మతం మారితే పెండ్లన్నారు..

మారాక కుదరదన్నారు 

హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన యువకుడు


ఆబిడ్స్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మతం మారితేనే వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువతి, ఆమె తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ఓ యువకుడు చేసిన ఫిర్యాదుపై మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో విచారణ నిర్వహించారు. వికారాబాద్‌ జిల్లా లాలాగూడ కాలనీకి చెందిన బొబ్బిలి భాస్కర్‌ (25) గత నెల 18న హెచ్ఛార్సీకి చేసిన ఫిర్యాదు ప్రకారం.. భాస్కర్‌ స్కూల్లో చదివే రోజుల్లో ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుమారు 11 ఏళ్ల పాటు కలిసి చదువుకున్న వీరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో భాస్కర్‌ యువతి తల్లిదండులను కలిశాడు. మతం మారితే వివాహం చేస్తామని వారు చెప్పారు. దీంతో భాస్కర్‌ మతం మారి, యువతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. వారు వివాహం చేయడానికి నిరాకరించడంతో పాటు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే  ఓ రోజు ఆమె తల్లిదండ్రులు ఆమెను గృహ నిర్బంధం చేశారు. విషయాన్ని ఆమె కుల పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, వారు మాట్లాడుతున్న సమయంలో ముగ్గురు భాస్కర్‌ను అసభ్య పదజాలంతో దూషించి, దాడి చేశారు. చంపుతామని చెదిరించారు. ఈ విషయంలో విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని భాస్కర్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.  

ఈ కేసును హెచ్‌ఆర్సీ మంగళవారం విచారించింది. అంతకు ముందే యువతిని తమ ముందు హాజరు పరచాలని వికారాబాద్‌ డీఎస్పీకి నోటీసులు జారీ చేసి ఉండడంతో వారు ఆమెను తీసుకువచ్చారు. కాగా, హెచ్‌ఆర్సీ ముందు సదరు యువతి ‘నాకు భాస్కర్‌ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు’ అని తెలిపింది. వారి మాటలు విని తాను తీవ్రంగా నష్టపోయానని భాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్‌ చంద్రయ్య యువతికి ఇష్టం లేని వివాహం చేయమని ఆదే శించలేమని, పెండ్లికి, మతం మార్పిడి అడ్డుకాదని సూచిస్తూ కేసును కొట్టివేశారు. 

Updated Date - 2020-02-12T09:23:06+05:30 IST