పేదల కోసం పద్దన్న..

ABN , First Publish Date - 2020-03-30T09:34:36+05:30 IST

డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారావు గౌడ్‌ సొంత నిధులతో లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.

పేదల కోసం పద్దన్న..

రూ. కోటి సొంత ఖర్చుతో నిత్యావసరాలు

ప్యాకెట్లు సిద్ధం చేయిస్తున్న డిప్యూటీ స్పీకర్‌


సికింద్రాబాద్‌/బౌద్ధనగర్‌, మార్చి29 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారావు గౌడ్‌ సొంత నిధులతో లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. సికిద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పది వేల నిత్యావసర వస్తువులతో ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. భార్య, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సుమారు రూ. కోటి సొంత నిధులతో నిత్యావసర సరుకుల ప్యాకెట్ల తయారు చేయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌లో రూ. 900 నుంచి రూ. వెయ్యి విలువైన బియ్యం, కందిపప్పు, పంచదార, చింతపండు ఉంటాయి. సీతాఫల్‌మండి మల్లీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ ప్యాకెట్లు సిద్ధమవుతున్నాయి.


ఏప్రిల్‌ మొదటివారంలో వీటిని ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో  పది కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పు, కిలో పంచదార, లీటరు నూనె ప్యాకెట్‌, అరకిలో చింతపండులతో కలిపి ప్రత్యేకంగా ప్యాకెట్లు తయారు చేయిస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ కోఆప్షన్‌ సభ్యుడు  రాజీవ్‌గుప్తా, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, నాయకులు నోముల ప్రకాశరావు, కరాటే శ్రీను, ఓడియన్‌ శ్రీను, బెజ్జంకి రాజేష్‌, తదితరులు ఆహార పాకెట్ల తయారీ పనుల్లో పాల్గొన్నారు.


Updated Date - 2020-03-30T09:34:36+05:30 IST