పద్మారావు అండ్ సన్స్..!
ABN , First Publish Date - 2020-12-07T17:12:33+05:30 IST
2016 గ్రేటర్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో భైరగోని ధనంజనగౌడ్

2016 గ్రేటర్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో భైరగోని ధనంజనగౌడ్ (బౌద్ధనగర్), సామల హేమ(సీతాఫల్‌మండి), పీఎన్.భార్గవి(మెట్టుగూడ), ఆలకుంట సరస్వతి(తార్నాక), విజయకుమారి(అడ్డగుట్ట)లు టీఆర్‌ఎస్ తరఫున గెలుపొందారు. అయితే, ఈసారి ఎన్నికల్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నాలుగు స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. బౌద్ధనగర్ నుంచి మాజీ కార్పొరేటర్ కంది నారాయణ కుమార్తె కంది శైలజకు, తార్నాక నుంచి తెలంగాణ ఉద్యమ నాయకుడు మోతే శోభన్‌రెడ్డి సతీమణి మోతే శ్రీలతారెడ్డి, అడ్డగుట్ట నుంచి లింగాని శ్రీనివాస్ సతీమణి లింగాని ప్రసన్నలక్ష్మి, మెట్టుగూడ నుంచి రాచూరి సునీతకు అవకాశం కల్పించారు. సీతాఫల్‌మండి నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ సామల హేమకు అవకాశం ఇచ్చారు. సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆయన కుమారులు తీగుళ్ల కిషోర్‌గౌడ్, కిరణ్‌కుమార్‌గౌడ్, రామేశ్వర్‌గౌడ్, తినేత్రగౌడ్‌లను రంగంలోకి దింపారు. కొత్తగా పోటీ చేస్తున్న అభ్యర్థుల డివిజన్లకు ఇన్‌చార్జిలుగా నియమించి బాధ్యతలు అప్పగించారు. వారు అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ ప్రచారం జరిగింది. కొన్ని డివిజన్లు బీజేపీ కైవసం అవుతాయన్న ప్రచారం జరిగింది. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఐదు డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.