జీహెచ్‌ఎంసీలో అమ్మకానికి కొలువులు?

ABN , First Publish Date - 2020-03-13T09:22:50+05:30 IST

జీహెచ్‌ఎంసీలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు అమ్మకానికి పెట్టారు. అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలు కుమ్మక్కై లక్షలు కొల్లగొడుతున్నారు.

జీహెచ్‌ఎంసీలో అమ్మకానికి కొలువులు?

హైదరాబాద్‌ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు అమ్మకానికి పెట్టారు. అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలు కుమ్మక్కై లక్షలు కొల్లగొడుతున్నారు. పోస్టును బట్టి ధర నిర్ణయించి మరీ కొత్తవారిని తీసుకుంటున్నారు. కొన్ని సర్కిళ్లలో అధికారిక అనుమతి లేదని ఖాళీల భర్తీ నిలిచిపోగా, మరి కొన్ని చోట్ల మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. బల్దియాలోని పారిశుధ్య నిర్వహణ విభాగంలో కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతోంది. ఖాళీగా ఉన్న ఎస్‌ఎ్‌ఫఏ పోస్టులు, మరణించిన, అనారోగ్యం, వయసు మీరిన వారి కార్మికుల స్థానంలో ఇతరులను తీసుకునే క్రమంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని సర్కిళ్లలో నూతనంగా నియమిస్తోన్న ఎస్‌ఎ్‌ఫఏ పోస్టుకు రూ.2లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకుంటున్నారని చెబుతున్నారు.


కార్మికులను తీసుకునేందుకు రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం కమిటీ ఆమోదం పొందిన తరువాతే కొత్తవారిని తీసుకుంటున్నప్పటికీ... సిఫారసు దశలోనే కాంట్రాక్టు సంస్థలతో కలిసి అధికారులు మతలబు చేస్తున్నారని చెబుతున్నారు. సర్కిల్‌ స్థాయిలో సిఫారసు, జోనల్‌ స్థాయిలో జరుగుతోన్న నియామకాల్లో అవక తవకలు జరుగుతున్నట్టు సమాచారం. కొన్ని జోన్ల పరిధిలో ఉన్నతాధికారులను తప్పుపట్టిస్తుండగా.. మరికొన్ని జోన్లలో వారికీ వాటాలు అందుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు ఏఎఓంహెచ్‌లు అన్నీ తామై వ్యవహరిస్తుండడం గమనార్హం. 


డిమాండ్‌ను సొమ్ముచేసుకుంటున్నారు...

అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో 950 మంది వరకు ఎస్‌ఎ్‌ఫఏలు ఉండాలి. 18,550 మంది పారిశుధ్య కార్మికులుండాలి. యేడాదిన్నర క్రితం పలు కారణాలతో ఎస్‌ఎ్‌ఫఏలను ఇతర జోన్లు, సర్కిళ్లకు బదిలీ చేశారు. పటాన్‌చెరులో ఉండే కొందరికి హయత్‌నగర్‌, ఉప్పల్‌, ముషీరాబాద్‌ తదితర సర్కిళ్లకు బదిలీ అయ్యింది. ఎల్‌బీనగర్‌లో పనిచేసే ఎస్‌ఎ్‌ఫఏలకు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ సర్కిళ్లకు స్థానచలనం కలిగింది. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే నగరంలో ఓ చివరి నుంచి మరో చివరికి వెళ్లి విధులు నిర్వహించడం కష్టంగా మారడంతో కొందరు ఉద్యోగం మానేశారు. మరికొందరు పరస్పర అవగాహనలో భాగంగా ఇతర ఎస్‌ఎ్‌ఫఏలతో సర్దుబాటు చేసుకున్నారు. బదిలీ అనంతరం కొందరు మానేయడం, పలువురు మరణించడం, అవినీతి ఆరోపణలతో ప లువురిని తీసేయడంతో పదుల సంఖ్యలో పోస్టు లు ఖాళీ అయ్యాయి. ఈ పోస్టుల భర్తీ క్రమంలోనే అధికారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. 


అంతా నిబంధనల ప్రకారమే కానీ... 

అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేసే ఎస్‌ఎ్‌ఫఏలను ఏజెన్సీల ద్వారా తీసుకుంటారు. ఏజెన్సీ నుంచి వచ్చే దరఖాస్తు ఆధారంగా అధికారులు ఫైల్‌ ప్రాసెస్‌ చేస్తారు. ఏఎంఓహెచ్‌ నుంచి ఫైల్‌ ఎంటమాలజీ సూపర్‌ వైజర్‌, డిప్యూటీ చీఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (డీసీటీఓ), డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌, జోనల్‌ కమిషనర్‌కు వెళ్తుంది. వారంతా ఆమోదించిన అనంతరం కేంద్ర కార్యాలయంలోని ఐటీ విభాగానికి పంపి ఎంపికైన వ్యక్తి హాజరు కోసం బయోమెట్రిక్‌ క్రియేట్‌ చేస్తారు. నిబంధనల ప్రకారమే అంతా జరుగుతుందనే భ్రమ కల్పిస్తూనే.. దరఖాస్తు దశలోనే ఏఎంఓహెచ్‌లు జోక్యం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వారు సూచించిన వ్యక్తుల దరఖాస్తులనే ఏజె న్సీలు సర్కిల్‌ కార్యాలయాల్లో సమర్పిస్తున్నాయి. ముందే ఉద్యోగం ఆశించే వారితో అధికారులు మాట్లాడుతున్నా రు.


ఎస్‌ఎ్‌ఫఏ పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు రేటు మాట్లాడుకొని ఫైల్‌ను ఉన్నతాధికారుల పరిశీలనకు పంపుతున్నారని సంస్థలో ప్ర చారం జరుగుతోంది. కోర్‌ ఏరియా జోన్‌లోని ఓ సర్కిల్‌ లో ఇప్పటికే కొందరు ఎస్‌ఎ్‌ఫఏలను కొత్తగా తీసుకున్నా రు. మరో పోస్టుకు సంబంధించి దరఖాస్తుదారుడు రూ. 1.5 లక్షలు ఇవ్వగా.. మరో రూ.50వేలు ఇస్తేనే బయోమెట్రిక్‌ కోసం పంపుతామని అధికారి పేచి పెట్టినట్టు సమాచారం. కోర్‌లోని మరో జోన్‌లో ఎస్‌ఎ్‌ఫఏల నియామకంలో లక్షల రూపాయలు చేతులు మారాయని చెబుతున్నారు. శివారులోని ఓ జోన్‌ పరిధిలోనూ ఇదే తంతు జరుగుతున్నట్టు తెలిసింది. ఓ సర్కిల్‌లో ఎస్‌ఎ్‌ఫఏ పోస్టు కోసం రూ.3లక్షలు తీసుకున్నట్టు చెబుతున్నారు. 


కార్మికుల నియామకాల్లోనూ.. 

చనిపోయిన, అనారోగ్య సమస్యలతో ఉన్న వారి స్థానం లో కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. కౌన్సిల్‌లో ఆమోదించినప్పటికీ.. సర్కారు నుంచి ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని అధికారులు చెబుతున్నారు. కానీ.. కొన్నిజోన్లలో మాత్రం నియామకాలు జరుగుతున్నాయి. ఉన్నత స్థాయి ఆదేశాల నేపథ్యంలోనే కార్మికులను తీసుకుంటున్నామని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కుటుంబ సభ్యులు కాని వారినీ కొన్నిచోట్ల తీసుకుంటుండడం గమనార్హం. ఇందుకుగాను రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.

Updated Date - 2020-03-13T09:22:50+05:30 IST