ఉస్మానియా ఖాళీ
ABN , First Publish Date - 2020-07-18T09:48:42+05:30 IST
ఉస్మానియా ఆసుపత్రి 112 సంవత్సరాల తర్వాత రోగులు లేకుండా వెలవెల బోయింది.

112 ఏళ్ల తర్వాత రోగులు లేకుండా...
మంగళ్‌హాట్, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆసుపత్రి 112 సంవత్సరాల తర్వాత రోగులు లేకుండా వెలవెల బోయింది. ఇటీవల కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున నీరు చేరింది. దీంతో ఆసుపత్రి భవనం మరింత ప్రమాదకరంగా మారింది. ఇక్కడ చికిత్సలు పొందుతున్న 350 మంది రోగులను వెంటనే కులీ కుతుబ్‌షాహీ, ఓపీ భవనాల్లోకి షిఫ్ట్ చేశారు. దీంతో ఆసుపత్రిలో ఖాళీ మంచాలు, సూపరింటెండెంట్ చాంబర్‌లో పనిచేస్తున్న అధికారులు మాత్రమే మిగిలిపోయారు. ప్రస్తుతానికి రోగులను మాత్రం ఇక్కడి నుంచి తరలించారు.
ఇప్పటికే రెండో అంతస్తు ఖాళీ
ఆసుపత్రిలో ఇటీవల అధికారులు దాదాపు రూ. 70 లక్షలతో వార్డులను ఆధునీకరిస్తున్నట్లు చెప్పి పనులు పూర్తి చేశారు. పాత భవనం చుట్టూ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. పాత భవనం కింది నుంచి ఉన్న నాలాను పట్టించుకోకుండా పనులు చేయడంతో ఆసుపత్రిలోకి నీరు చేరింది. దీంతో పాటు భవనం పై పెచ్చులు ఊడుతుండడంతో గతంలోనే రోండో అంతస్తును పూర్తిగా ఖాళీ చేశారు.
డ్రైనేజీ ఆధునీకరణ పనులు ప్రారంభం...
నిజాం కాలంలో నిర్మించిన ఉస్మానియా పాత భవనం కింది నుంచి, పరిసర ప్రాంతాల నుంచి మురుగు నీటి నాలాలు వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సిద్ధంబర్ బజార్, బర్తన్‌బజార్‌లతో పాటు తదితర ప్రాంతాల మీదుగా ఉస్మానియా ప్రాంగణం నుంచి ఓ మురుగు నీటి నాలా ఉన్నట్లు తేల్చారు. గతంలో ఆర్కియాలజీ విభాగం అధికారులు సీఎ్‌సఎంఎ్‌సఐడీసీ అధికారులకు ఉస్మానియా పాత భవనం బ్ల్యూ ప్రింట్‌ను అందజేసినట్లు సమాచారం. అది ఇప్పుడు ఎక్కడ ఉందన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉస్మానియా ఆసుపత్రి చుట్టూ నీరు నిలవకుండా నిజాం కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు..? ఆస్పత్రి కింది భాగంలో ఎక్కడెక్కడ నాలాలు ఉన్నాయి..? అనే విషయాన్ని అధికారులు తేల్చలేకపోతున్నారు.
ఆసుపత్రిలోకి నీరు చేరడంతో జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో సెక్యూరిటీ కార్యాలయం ముందు ఉన్న మ్యాన్‌హోల్‌ను తవ్వి చూడగా పెద్ద ఎత్తున నీరు పైకి ఉబిగిపడుతోంది. డిజాస్టార్ మేనేజ్మెంట్ సిబ్బంది రెండు మోటర్లను బిగించి నీటిని బయటకు తోడేస్తున్నారు. నాలా ఎటు వెళ్తుందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూమి లోపల ఉన్న నాలా కూరుకుపోవడంతోనే మురుగు నీరు ఉప్పొంగి ఆసుపత్రి వార్డుల్లోకి చేరినట్లు అధికారులు గుర్తించారు. మురుగునీటి వ్యవస్థపై టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ అధికారులకు పూర్తి అవగాహన లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో నాలాను వెలికి తీసి పూడిక తీత పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.