గ్రేటర్‌లో మూతపడిన ఆలయాలు

ABN , First Publish Date - 2020-03-21T09:42:52+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ఆలయాలపై కూడా పడింది. తమ ఇష్ట దైవాలను కొలిచేందుకు ఆలయాలకు వచ్చే భక్తులతో వైరస్‌ రెట్టింపు స్థాయిలో వ్యాప్తిచెందే అవకాశముందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలు, మసీదులు, చర్చిలను మూసివేయాలని పిలుపునిచ్చింది.

గ్రేటర్‌లో మూతపడిన ఆలయాలు

కరోనా ఎఫెక్ట్‌


హైదరాబాద్‌ సిటీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ఆలయాలపై కూడా పడింది. తమ ఇష్ట దైవాలను కొలిచేందుకు ఆలయాలకు వచ్చే భక్తులతో వైరస్‌ రెట్టింపు స్థాయిలో వ్యాప్తిచెందే అవకాశముందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలు, మసీదులు, చర్చిలను మూసివేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పెద్ద ఆలయాలతోపాటు చిన్న చిన్న గుడులన్ని మూతపడ్డాయి. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి దేవాలయాన్ని నిత్యపూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు మూసివేశారు. ఈనెల 31 వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించమని నిర్వాహకులు తెలిపారు.


బంజారాహిల్స్‌ రోడ్డు నంబరులో 12లోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి(స్వర్ణ) దేవాలయాన్ని, అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ వీరన్నగుట్టలోని శ్యాంబాబా మందిర్‌ను, బర్కత్‌పురలోని శ్రీరాఘవేంద్రస్వామి మఠాన్ని, మహాంకాళి అమ్మవారి దేవాలయం, సూర్యదేవాలయం, లింగంపల్లి హనుమాన్‌దేవాలయాలు కరోనాతో మూసివేశారు. వీటితోపాటు అమీర్‌పేటలోని కనకదుర్గ, చిక్కడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఆర్జితసేవలు, అన్నదానాలు రద్దు చేశారు. కర్మన్‌ఘాట్‌ శ్రీధ్యానాంజనేయస్వామి ప్రధాన ఆలయాన్ని మూసివేతతో భక్తులు బయటి నుంచే స్వామి వారిని దర్శించుకుని వెళ్లారు. కేపీహెచ్‌బీకాలనీలోని శ్రీవీరాంజనేయ, నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో పూజలను నిలిపి వేశారు. దిల్‌సుఖ్‌నగర్‌ శ్రీషిర్డిసాయి సంస్థాన్‌కు భక్తులను అనుమతించలేదు. అలాగే కొత్తపేట స్నేహపురి కాలనీలోని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం మూసేశారు. 

Updated Date - 2020-03-21T09:42:52+05:30 IST