తెరుచుకున్న గడ్డిఅన్నారం మార్కెట్‌ గేట్లు

ABN , First Publish Date - 2020-03-24T09:21:09+05:30 IST

రెండు రోజుల బంద్‌ తరువాత సోమవారం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ గేట్లు తెరచుకున్నాయి.

తెరుచుకున్న గడ్డిఅన్నారం మార్కెట్‌ గేట్లు

పంటతో వచ్చింది ముగ్గురు రైతన్నలే..!

మార్కెట్‌ బంద్‌కు కమీషన్‌ ఏజెంట్ల వినతి


దిల్‌సుఖ్‌నగర్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రెండు రోజుల బంద్‌ తరువాత సోమవారం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ గేట్లు తెరచుకున్నాయి. యథాప్రకారం తిరిగి క్రయ, విక్రయాలు మొదలయ్యాయి. పంటను విక్రయించేందుకు పెద్దగా సరుకు రాకపోవడంతో మార్కెట్‌ ఖాళీగా దర్శనమిచ్చింది. ప్రతి రోజూ వందలాది లారీలు, డీసీఎంలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉండే మార్కెట్‌కు సోమవారం 20లారీలు, 18డీసీఎంలు, 28ఆటోలు, 21 బొలేరొలు మాత్రమే సరుకుతో వచ్చాయి. సరుకు కొనుగోలు చేసేందుకు నగరంలోని రిటైల్‌ వర్తకులు పెద్దగా రాకపోవడంతో కమీషన్‌ ఏజెంట్లు నిట్టూర్చారు. 


కేవలం ముగ్గురే..!

పంటను విక్రయించేందుకు కొల్లాపూర్‌ నుంచి ఇద్దరు మామిడి రైతులు నాలుగున్నర టన్నుల మామిడి పంటను తీసుకుని రాగా, నల్గొండ జిల్లాకు చెందిన బత్తాయి రైతు 2 టన్నుల మోసంబిని విక్రయానికి తీసుకువచ్చారు. కేవలం ముగ్గురు రైతన్నలు మినహా ఇతర సరుకును నేరుగా కమీషన్‌ ఏజెంట్లు దళారీల ద్వారా తీసుకువచ్చారు. 7004 బాక్స్‌(40వేల పండ్ల్లు)ల యాపిల్‌, 3830 బాక్స్‌ల, 161 క్రేట్‌(30వేల కిలోల)ల ద్రాక్ష, 8 టన్నుల కర్బూజ, 8200 క్రేట్‌ల ఆరేంజ్‌, 20 టన్నుల బొప్పాయి, 81 టన్నుల పైనాఫిల్‌, 2324 బాక్స్‌ల దానిమ్మ, 380 బాక్స్‌ల కివి, 370 బాక్స్‌ల డ్రాగన్‌ ఫ్రూట్‌లు మాత్రమే వచ్చాయి.


రోడ్లపై పుచ్చకాయల విక్రయం..

పుచ్చకాయలను దళారీలు సర్వీసు రోడ్లపైనే విక్రయిస్తుండడంతో మార్కెట్‌కు సోమవారం ఒక్క లోడు కూడా రాలేదు. చైతన్యపురి చౌరస్తా నుంచి కొత్తపేట చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లపై పుచ్చకాయలోడుతో ఉన్న లారీలు, డీసీఎంలు నిలిపి నేరుగా విక్రయిస్తున్నారు.


మార్కెట్‌ బంద్‌ కోసం వినతి...ఉన్నతాధికారుల దృష్టికి..

వివిధ జిల్లాలతో పాటు, మహారాష్ట్ర, నాగ్‌పూర్‌ తదితర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు సరుకు వస్తుండడం, ప్రతి రోజూ వేలాది మంది రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో వైరస్‌ సులువుగా వ్యాపించే అవకాశం ఉంటుందని మార్కెట్‌లోని కమీషన్‌ ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కమీషన్‌ ఏజెంట్లు సోమవారం గడ్డి అన్నారం మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి వెంకటేశంను కలిసి కొద్దిరోజుల పాటు మార్కెట్‌ను బంద్‌ చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రతిపాదనను పాలకవర్గం, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు, డైరెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారని ఎస్‌జీఎస్‌ వెంకటేశం తెలిపారు. పాలకవర్గం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి కార్యచరణను నిర్ణయిస్తామని వెల్లడించారు.


సోషల్‌ డిస్టెన్స్‌ పాటించని వినయోగదారులు..

పండ్ల మార్కెట్‌, రైతుబజార్‌లు, దుకాణాలకు వస్తున్న వినియోగదారులు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. సోమవారం వేలాది సంఖ్యలో రైతుబజార్‌లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారుల్లో చాలా మంది కనీసం మాస్క్‌లు కూడా ధరించలేదు. కొనుగోళ్ల సమయంలో మనిషికి, మనిషికి మధ్య దూరాన్ని పాటించలేదు. 

Updated Date - 2020-03-24T09:21:09+05:30 IST