తెరుచుకోని బేకరీలు

ABN , First Publish Date - 2020-05-11T09:04:39+05:30 IST

ఎప్పుడూ వినియోగదారులతో కళకళలాడే బేకరీలు లాక్‌డౌన్‌ కారణంగా మూతబడ్డాయి.

తెరుచుకోని బేకరీలు

ఇబ్బందుల్లో యజమానులు

లాక్‌డౌన్‌ తర్వాతా వ్యాపారం అంతంతే!

ప్రభుత్వం ఆదుకోవాలంటున్న నిర్వాహకులు


హైదరాబాద్‌ సిటీ, మే 10(ఆంధ్రజ్యోతి): ఎప్పుడూ వినియోగదారులతో కళకళలాడే బేకరీలు లాక్‌డౌన్‌ కారణంగా మూతబడ్డాయి. వాటిని నమ్ముకున్న యజమానులు, అందులో పనిచేసే మాస్టర్‌లు, ఇతర సిబ్బంది బతుకులు భారంగా మారాయి. బేకరీలో కేవలం కేక్‌లు మాత్రమే కాదు... జిహ్వాచాపల్యం తీర్చుకునేందుకు అనేక రకాల పదార్థాలు అందుబాటులో ఉంటాయి. నోరూరించే పేస్ట్రీలు, డొనట్స్‌, బర్గర్‌, చికెన్‌రోల్స్‌, పిజ్జా, కూల్‌డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌, ఐస్‌క్రీం, ఎగ్‌, వెజ్‌ప్‌ఫలు ఇలా ఎన్నోరకాల తినుబండారాలు దొరికేది ఇక్కడే. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుకుంటే వేడి చాయ్‌ తాగేందుకు కేరా్‌ఫగా కేఫ్‌లు ఉంటే... అదే చల్లటి కూల్‌డ్రింక్‌ తాగుతూ నచ్చినది తినేందుకు బేకరీలే అడ్డా.  


లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లతోపాటు బేకరీలు కూడా మూతపడ్డాయి. అందులో తయారు చేసిన తినుబండారాలన్నీ పాడపోయాయి. కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీంల ఎక్స్‌పైరీ డేట్‌ కూడా దగ్గరపడింది. ఎండాకాలంలో ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీం తెచ్చిపెట్టుకున్న నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. నగరంలో ప్రముఖ బేకరీలతోపాటు వేలాది చిన్నచిన్న బేకరీలు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో వారి ఉపాధి పోవడంతోపాటు అందులో పనిచేసే మాస్టర్లు, పనివారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 


రాబడికి తగినట్లు ఖర్చులు...

బేకరీ నిర్వహించాలంటే బేక్‌ చేసేందుకు పెద్ద కిచెన్‌తోపాటు కూర్చుని తినేందుకు తగినంత స్థలం కావాలి. వీటి కోసం పెద్ద పెద్ద దుకాణాలు తీసుకోవాలి. దాని అద్దె పెద్ద మొత్తంలో ఉంటుంది. కేకులు, కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీంల కోసం పెద్ద పెద్ద ఫ్రీజర్లు వాడాలి. వేడి చేసి ఇచ్చేందుకు ఓవెన్‌లు కావాలి. ఇలా అన్నీ వినియోగించడం వల్ల కరెంట్‌ బిల్లు వేలల్లో వస్తుంది. అంతేకాకుండా నేర్పరులైన మాస్టర్లకు ఎక్కువ జీతం ఇవ్వాలి. ఇన్ని ఖర్చులు భరించి వ్యాపారం చేసేవారికి లాభాలు చెప్పుకోదగినంతగా ఉండవు. దానికి లాక్‌డౌన్‌ కారణంగా బేకరీలు మూతపడి వారి ఆర్థిక పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. 


ఆర్థికంగా చితికిపోయాం...సలీం, ఉడెన్‌ బేకరీ నిర్వాహకుడు

జనతా కర్ఫ్యూ ఒక్కరోజే అని భావించి యథావిధిగా సరుకులు కొనుగోలు చేశాను. కేకులు తయారు చేయించాను. కూల్‌డ్రింక్‌లు, ఐస్‌క్రీంలు ఆర్డర్‌ చేసి నిల్వ ఉంచాను. వెంటనే లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తెచ్చిన ముడి సరుకు వృథా అయింది. చేసిన కేకులు పడేయాల్సి వచ్చింది. చిప్స్‌, ఐస్‌క్రీం, కూల్‌డ్రింక్‌లు ఎక్స్‌పైరీ డేట్‌కు చేరుకున్నాయి. మాస్టర్‌లకు, పనిచేసేవారికి ఎంతో కొంత ఇచ్చి కాపాడుకుంటున్నాను. రెండు సార్లు లాక్‌డౌన్‌ పొడిగించడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా. వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయి. అలా అని ఫ్రిజ్‌ బంద్‌చేస్తే కొన్న సరుకు చెడిపోతుంది. లాక్‌డౌన్‌ ముగిసినా మునుపటిలా వ్యాపారం జరగదు. ప్రభుత్వం బేకరీ యజమానులను ఆదుకోవాలి.


Updated Date - 2020-05-11T09:04:39+05:30 IST