ఒంటరి పోరాటం
ABN , First Publish Date - 2020-12-06T07:28:10+05:30 IST
ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి సుప్రియాగౌడ్ విజయం కోసం ఆమె భర్త, నియోజకవర్గ బీజేపీ జాయింట్ కన్వీనర్ నవీన్‌గౌడ్ అన్నీ తానై కృషి చేశారు.

అన్నీ తానై సతీమణిని గెలిపించుకున్న భర్త
ముషీరాబాద్, డిసెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి సుప్రియాగౌడ్ విజయం కోసం ఆమె భర్త, నియోజకవర్గ బీజేపీ జాయింట్ కన్వీనర్ నవీన్‌గౌడ్ అన్నీ తానై కృషి చేశారు. డివిజన్‌లో కొందరు సహకరించకున్నా, ఆయన కృషి, పట్టుదల, ప్రజలతో ఉన్న సంబంధాలతో నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో గెలిచిన బీజేపీ అభ్యర్థుల కంటే భారీ మెజారిటీతో తన సతీమణిని గెలిపించుకున్నారు. సుప్రియాగౌడ్‌కు 2,740 అత్యధిక మెజారిటీ దక్కింది. ఎన్నికల ప్రచారం, కార్యకర్తలను సమన్వయం చేయడంతో మొదలు పెట్టి కుల పెద్దలు, యువజన, మహిళా సంఘాలతో చర్చలు జరిపే దాక.. నవీన్‌గౌడ్ రాత్రీపగలు కష్టపడ్డారు. ముఖ్యంగా యువత తమ వెంట ఉండేలా చేసుకున్నారు. సోదరుడి కుమారుడు కుశాల్‌గౌడ్ మినహా బంధువులు సైతం ఎన్నికల ప్రచారంలో కనిపించలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కొందరు ఆశావహులు ఆందోళన బాట పట్టగా, కొందరు పార్టీకి రాజీనామా చేశారు. ఇంకొందరు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నవీన్‌గౌడ్ అధైర్యపడకుండా పని చేశారు. దీంతో ఆయన సతీమణి సుప్రియ సిట్టింగ్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి హరిబాబుయాదవ్‌పై విజయం సాధించారు. 2016 ఎన్నికల్లో ఈ డివిజన్‌ను మిత్రపక్షానికి కేటాయించగా, నవీన్‌గౌడ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అగ్రనేతల అండతో తాజా ఎన్నికల్లో తన సతీమణిని గెలిపించుకున్నారు.