ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తే అంతే సంగతులు.. క్షణాల్లో ఖాతాల్లోంచి డబ్బు మాయం..!

ABN , First Publish Date - 2020-08-14T15:52:06+05:30 IST

ఇప్పటి వరకు ఫోన్‌ ద్వారా ఓటీపీలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల మోసాలకు పాల్పడిన సైబర్‌ నేరస్థులు రూటు మార్చారు. సపోర్టింగ్‌ యాప్‌ల ద్వారా

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తే అంతే సంగతులు.. క్షణాల్లో ఖాతాల్లోంచి డబ్బు మాయం..!

‘క్విక్‌’గా సైబర్‌ చోరీ .. సపోర్టు యాప్‌తో నేరస్థుల నయా దందా

మాయ మాటలతో క్షణాల్లో ఖాతాల్లోంచి డబ్బులు మాయం


హిమాయత్‌నగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు ఫోన్‌ ద్వారా ఓటీపీలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల మోసాలకు పాల్పడిన సైబర్‌ నేరస్థులు రూటు మార్చారు. సపోర్టింగ్‌ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్ లోకి ప్రవేశించి అమాయకుల ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇటీవల సీసీఎస్‌ సైబర్‌ క్రైం స్టేషన్‌కు వస్తున్న ఫిర్యాదులతో కొత్త తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. గిఫ్ట్‌ ఓచర్‌, ఇతర బహుమతులు, కేవైసీల పేరిట మాయమాటలు చెప్పి మోసాలు చేస్తున్నారు. 


ఫోన్‌పే ద్వారా..

బేగంపేట్‌కు చెందిన ఓ మహిళకు సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి రూ.4 వేల గిఫ్ట్‌ ఓచర్‌ వచ్చిందని చెప్పారు. ఫోన్‌పే ద్వారా ఆ డబ్బును ఆమె ఖాతాకు బదిలీ చేస్తామంటూ ప్రొసీడింగ్‌ టూ పే రిక్వెస్ట్‌ పంపించారు. గిఫ్ట్‌ ఓచర్‌ నగదు కోసం ఆమె మోసగాళ్ల రిక్వెస్ట్ ను అంగీకరించారు. వెంటనే బాధితురాలి ఖాతా నుంచి రూ. 4వేలు సైబర్‌నేరగాళ్ల ఖాతాకు బదిలీ అయ్యాయి. ఆమె ఆ నెంబర్‌కు ఫోన్‌ చేయగా డబ్బులు వాపస్‌ ఇస్తామని మరో పథకం రూపొందించారు. క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు అందులో నమోదు చేస్తే ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తాయని నమ్మించారు. వారి మాటలు నమ్మి ఆమె ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంది. క్విక్‌ సపోర్టు యాప్‌తో మరోచోట ఆమె ఫోన్‌ వ్యవహారాలను తస్కరించిన సైబర్‌ నేరగాళ్లు ఆమె సెల్‌ఫోన్‌లో జరుగుతున్న బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు తెలుసుకొని.. ఖాతాలో నుంచి రూ. 2.35 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 


ఇంకెన్నో ఘటనలు..

మరో ఘటనలో పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించిన సైబర్‌ నేరగాళ్లు... మలక్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ. 55 వేలు కాజేశారు. దక్షిణ మధ్య రైల్వేలో లోకోపైలెట్‌గా పనిచేసే ఓ ఉద్యోగి ఇటీవల తన స్నేహితుడికి గూగుల్‌పే ద్వారా రూ. 3 వేలు పంపించాడు. ఆ డబ్బు అవతలి వ్యక్తికి చేరకపోవడంతో గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో వెతికాడు. అందులో లభించిన నంబర్‌కు ఫోన్‌ చేయడంతో తాము గూగుల్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ మాట్లాడిన సైబర్‌నేరగాళ్లు, అతడితో క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి అతడి ఖాతా నుంచి రూ. 80 వేలు కాజేశారు. మరో ఘటనలో ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ మార్కెట్‌ ప్లేస్‌లో సెకెండ్‌ హ్యాండ్‌లో హోండా యాక్టివా కొనేందుకు ప్రయత్నించగా.. తక్కువ ధరకు విక్రయిస్తామని ముందుకొచ్చిన సైబర్‌నేరగాళ్లు అడ్వాన్స్‌ రవాణా చార్జీల పేరిట రూ. 57 వేలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఆయా ఘటనల్లో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజా ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు కేవైసీ, క్విక్‌ సపోర్ట్‌ యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 


 అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. అపరిచితుల నుంచి మెయిల్‌, వాట్సాప్‌, ఇతర మాధ్యమాలలో వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు. సైబర్‌ నేరాలపై ఎల్‌బీనగర్‌ సైబర్‌ పీఎ్‌సలో లేదా వాట్సాప్‌ నంబర్‌ 9490617111 ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. కరోనా నేపథ్యంలో సైబర్‌ నేరాల నివారణకు నిపుణుల సలహాలు సూచనలనూ వెబ్‌సైట్‌లోపోస్టర్ల ద్వారా, వాట్సాప్‌ మెసేజీల రూపంలో అందజేస్తున్నాం. 

 - మహేష్‌ భాగవత్‌, సీపీ, రాచకొండ


దేశమంతటా అవగాహన కార్యక్రమాలు

సైబర్‌ సెక్యూరిటీపై ఎలాంటి సందేహాలున్నా 1800425 6235కు కాల్‌ చేసి లేదా www.infoSecawareness.in వెబ్‌సైట్‌ ద్వారా సమాచారం పొందవచ్చు. సైబర్‌ నేరాల నివారణే ధ్యేయంగా దేశమంతటా వెబినార్‌ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.  

- ఎం.జగదీ్‌షబాబు, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ఐఎస్‌ఈఏ, హైదరాబాద్‌



నిపుణుల సూచనలు

అపరిచితులు ఆన్‌లైన్‌లో ఇచ్చే సలహాలను సూచనలను గుడ్డిగా నమ్మొద్దు.

వారి మాయమాటలు నమ్మి గుర్తుతెలియని యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. 

బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ నంబర్లు, మొబైల్‌ తదితర వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. 

 బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఫోన్‌ ద్వారా తెలియజేయాలని కోరవు/అడగవు

వీటి ద్వారా ఫిర్యాదు చేయొచ్చు

ఫిర్యాదు యూఆర్‌ఎల్‌ http://cybercrime.gov.in/

www.cybercrime.gov.in

Updated Date - 2020-08-14T15:52:06+05:30 IST