‘కట్టడి’ చేయట్లే..
ABN , First Publish Date - 2020-06-23T10:39:52+05:30 IST
ముషీరాబాద్ నియోజకవర్గం లో కరోనా కలక లం సృష్టిస్తున్నా, నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం

శానిటైజేషన్ మరిచిన అధికారులు
భయం గుప్పిట్లో జనం
కవాడిగూడ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్ నియోజకవర్గం లో కరోనా కలక లం సృష్టిస్తున్నా, నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం చెందుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం పాజిటివ్ వచ్చిన ఇంటినే క్వారంటైన్ చేసి వదిలేయడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కనీసం ఆ ప్రాంతంలో శానిటైజేషన్ కూడా చేయడం లేదు. కవాడిగూడ డివిజన్‌లోని బండనగర్‌లో ఇటీవల ఓ వృద్ధురాలికి పాజిటివ్ వచ్చింది. తాజాగా ఓ వృద్ధుడు వెన్నెముక సమస్యతో ఐఎ్‌సఐ ఆస్పత్రికి వెళ్లగా, అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఇంట్లో ఉన్న వృద్ధుడి కుమార్తెను హోం క్వారంటైన్ చేశారు. అయితే, ఆ ఇంటి పరిసరాల్లో శానిటైజేషన్ చేయకపోవడంతో స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో వారే స్వయంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేయగా, ఒక్కసారి వచ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లి వెళ్లారని బండనగర్‌వాసులు ఆరోపిస్తున్నారు. ఉన్నికోటలో ఉంటూ గాంధీ ఆస్పత్రిలో పని చేసే ఓ మహిళ కూడా కరోనా బారిన పడగా, ఆమె ఇంట్లో నలుగురిని హోం క్వారంటైన్ చేశారు. అక్కడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
రెండు రోజుల క్రితం తాళ్లబస్తీకి చెంది న ఇద్దరు వృద్ధులు కరోనాతో చనిపోయినా, పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేయడం లేదంటున్నారు. అయితే, వాహనాల కొరత వల్ల శానిటైజ్ చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారని, అధికారు లు స్పందించి పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో శానిటైజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.