పెళ్లి.. ఉద్యోగం పేరుతో మహిళకు టోకరా

ABN , First Publish Date - 2020-07-14T10:16:45+05:30 IST

ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో అతనో ఆఫీ్‌సబాయ్‌.. సినిమా, సీరియల్‌ ఆర్టిస్టులతో పరిచయాలు

పెళ్లి.. ఉద్యోగం పేరుతో మహిళకు టోకరా

రూ. 25లక్షలు కాజేసిన ఆఫీస్ బాయ్ 


హైదరాబాద్‌ సిటీ, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో అతనో ఆఫీస్ బాయ్ ‌.. సినిమా, సీరియల్‌ ఆర్టిస్టులతో పరిచయాలు చేసుకునేవాడు. సులభంగా డబ్బు సంపాదించాలని, ఎంజాయ్‌ చేయాలని అనుకునేవాడు. స్నేహితునితో కలిసి పథకం ప్రకారం.. మేకప్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్న మహిళను బురిడీ కొట్టించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో పాటు.. ఆమె తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 25 లక్షలు కొట్టేశాడు.


సైబర్‌ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిల్మ్‌చాంబర్‌లో నరేశ్‌కుమార్‌ ఆఫీ్‌సబాయ్‌గా పనిచేస్తున్నాడు. లగ్జరీ జీవితాన్ని గడపాలని అతని కోరిక. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని స్నేహితుడు గిరిబాబుతో కలిసి పథకం వేసుకున్నాడు. తనకున్న సినిమా పరిచయాన్ని అందుకు వాడుకోవాలని భావించాడు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మేకప్‌ వేసే ఓ మహిళ నంబర్‌ సంపాదించాడు. ఆమెకు ఫోన్‌ చేసి తానొక సీరియల్‌ నటుడినని పరిచయం చేసుకున్నాడు. తనకున్న పరిచయాల ద్వారా పెద్ద పెద్ద ఫంక్షన్‌లు, పెళ్లిళ్లకు మేకప్‌ వేసే కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించాడు.


ఆ పరిచయాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లాడు. తన తమ్ముడికి ఏదైనా ఉద్యోగం చూడాలని కోరింది. దాంతో నాకు రైల్యే డిపార్టుమెంట్‌లో పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఉంది. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. భారీగా ఖర్చు అవుతుందని చెప్పాడు. అలా విడతల వారీగా ఆమె నుంచి రూ. 25 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం విషయం దాటవేస్తూ ఉండడంతో ఆమెకు అనుమానం వచ్చింది. అతనికి ఫోన్‌ చేయగా ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చేది. స్నేహితుడు గిరిబాబుతో కలిసి ఆ డబ్బుతో వైజాగ్‌, తిరుపతి ప్రాంతాల్లో కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద హోటళ్లలో ఉంటూ జల్సాలు చేశాడు. కొత్త బైక్‌, బంగారం ఆభరణాలు కొనుగోలు చేశాడు.


మహిళ ఫిర్యాదుతో ఏసీపీ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ ఆశీ్‌షరెడ్డి టెక్నికల్‌ ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వారి నుంచి రూ. 4లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-07-14T10:16:45+05:30 IST