కొనసాగుతున్న కబ్జాకాండ
ABN , First Publish Date - 2020-08-20T09:44:11+05:30 IST
చెరువుల ఆక్రమణ ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పట్టించుకోని ప్రభుత్వ విభాగాలు

ఙవరద ముంపులో కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నా... పలు చోట్ల ఇల్లు కూలుతోన్నా... చెరువుల ఆక్రమణ ఆగడం లేదు. అభివృద్ధి విస్తరణతో పాటు గ్రేటర్‌లో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వ విభాగాలు పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో కబ్జాకాండ జోరుగా సాగుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మున్ముందు ఇళ్లే చెరువులవుతాయి. ఆక్రమణలు తొలగించకుండా సుందరీకరణ పేరిట చెరువుల వాస్తవ విస్తీర్ణాన్ని ప్రభుత్వ విభాగాలే తగ్గిస్తుండడం గమనార్హం. గ్రేటర్‌లోని పలు చెరువుల పరిస్థితి ఇలా...
హైదరాబాద్ సిటీ నెట్‌వర్క్, ఆగస్టు 19:
చెరువుల ఆక్రమణ ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పట్టించుకోని ప్రభుత్వ విభాగాలు
శిఖం భూములు అన్యాక్రాంతం
పాతబస్తీ శివారులోని జల్‌పల్లి పెద్ద చెరువు, రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలోని ఊరచెరువు శిఖం, బఫర్ జోన్ ప్రాంతాలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. చెరువుల రక్షణ కోసం అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో శిఖం భూములతో పాటు నాలాలు కూడా చిన్నగా మారాయి.
జల్‌పల్లి పెద్ద చెరువు అన్యాక్రాంతం
జల్‌పల్లి పెద్ద చెరువు 190.4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఎఫ్‌టీఎల్ 45 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. కొంత కాలంగా ఎఫ్‌టీఎల్ భూముల్లో కాలనీలు వెలిశాయి. ప్రస్తుతం ఎఫ్‌టీఎల్ పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయింది. చెరువుకు వచ్చే మామిడిపల్లి నల్లవాగు నాలాతో పాటు పహడీషరీఫ్ బుగ్గ నుంచి వచ్చే నాలా, గగన్‌పహడ్ నుంచి వచ్చే నాలాలు పూర్తిగా కుంచించుకుపోయాయి. వీటిపై రెవెన్యూ అధికారులు సరైన విధంగా చర్యలు చేపట్టకపోవడం, రాజకీయ ఒత్తిళ ్ళ కారణంగా జల్‌పల్లి పెద్ద చెరువు శిఖం పూర్తిగా కనుమరుగైంది.
ఊరచెరువులో వెంచర్..!
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి శివరాంపల్లిలో నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువు అయిన ఊరచెరువు శిఖం, బఫర్ జోన్ పూర్తిగా కబ్జాకు గురైంది. సుమారు రెండెకరాల తొమ్మిది గుంటల స్థలంలో అక్రమంగా వెంచర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. శిఖం, బఫర్ జోన్ ప్రాంతాలలో ఇప్పటికే మట్టిపోసి చదును చేశారు. రెవెన్యూ అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు. శిఖం భూముల్లో రేకుల షెడ్లు, ప్రహరీలు వెలిశాయి.
ఎప్పుడో కబ్జాకు గురయ్యాయి
జల్‌పల్లి పెద్ద చెరువు శిఖం భూములలో కబ్జాలు నా హయంలో జరగలేదు. అవి ముందే జరిగాయి. ఇక మీదట ఎలాంటి కబ్జాలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
- బాలాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి
కేసులు నమోదు చేశాం
శివరాంపల్లి ఊరచెరువు శిఖం భూములలో మట్టిపోసి ప్లాట్లు చేయాలనుకుంటున్న వారిపై కేసులు నమోదు చేశాం. ఎట్టి పరిస్థితిలో కబ్జాకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
- రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్‌గౌడ్