25 పురాతన భవనాలకు నోటీసులు
ABN , First Publish Date - 2020-08-20T09:53:47+05:30 IST
నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు పురాతన ఇళ్ల గోడలు కూలిపోయాయి.

రాంనగర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు పురాతన ఇళ్ల గోడలు కూలిపోయాయి. బాగ్‌లింగంపల్లిలో ప్రమాదకరంగా ఉన్న అపార్ట్‌మెంట్లను ముషీరాబాద్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ పావని, సెక్షన్ ఆఫీసర్ రాందాస్, సిబ్బంది జగన్, అనిల్, రాజయ్య, రాంనగర్ కార్పొరేటర్ వి.శ్రీనివా్‌సరెడ్డితోపాటు పలువురు నేతలు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ పావని మాట్లాడుతూ నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్‌మెట్, ముషీరాబాద్, భోలక్‌పూర్, కవాడిగూడ, గాంధీనగర్ డివిజన్లలో శిథిలావస్థలో ఉన్న 25 ఇళ్ల యజమానులు వీటిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల కవాడిగూడలో రెండు పురాతన ఇళ్లు, రాంనగర్ నుంచి వీఎస్టీ వెళ్లే మెయిన్ రోడ్‌లో ఓ కంపెనీ ప్రహరీ కూలిపోయిందని తెలిపారు.
అడిక్‌మెట్‌లో ప్రమాదకరంగా ఉన్న ఓ ఇంటిని పరిశీలించి అందులో ఉంటున్న వారిని ఖాళీ చేయించి దానిని కూల్చివేశామని తెలిపారు. నాలుగైదు దశాబ్దాలు దాటిన వాటిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేసుకోవాలని, లేనిపక్షంలో కూల్చివేస్తామని ఆమె తెలిపారు. ఆజామాబాద్‌లోని పలు కంపెనీల ప్రహరీలను పరిశీలించినట్టు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కార్పొరేటర్ వి.శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ బాగ్‌లింగంపల్లిలోని హౌసింగ్ బోర్డు అధికారులు నిర్మించిన చాలా అపార్ట్‌మెంట్‌లు ప్రమాదకరంగా ఉన్నాయని అన్నారు. అందులో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆయన సూచించారు.