నోటాకే ఎక్కువ.. మెజారిటీ తక్కువ..!

ABN , First Publish Date - 2020-12-01T07:21:02+05:30 IST

గ్రేటర్‌ కార్పొరేటర్‌ అభ్యర్థులను నోటా ఓటు భయపెడుతోంది.

నోటాకే ఎక్కువ.. మెజారిటీ తక్కువ..!

గత ఎన్నికల్లో కొన్ని చోట్ల తీరిది.. 

గ్రేటర్‌లో ఏం చేస్తారో అని గుబులు

గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ కార్పొరేటర్‌ అభ్యర్థులను నోటా ఓటు భయపెడుతోంది. గత ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్ల శాతాన్ని చూసి నేటి పోలింగ్‌లో ఏం జరుగుతుందో అన్న భయం పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ఓట్లు అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికలకంటే, 47 శాతం పెరిగాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 1.52 లక్షల ఓట్లు నోటాకు పడ గా, 2018లో 2.25 లక్షల ఓట్లు పడ్డాయి. అంటే నాటి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలైన 2.05 కోట్ల ఓట్లలో 1.1 శాతం నోటాకే పడ్డాయి. ఇక గ్రేటర్‌ పరిధిలో ఒక్కో డివిజన్‌లో సగటున 50 వేల ఓట్లు మాత్రమే ఉన్నందున పోలయ్యే ఓట్లపైనే అభ్యర్థుల భవితవ్వం ఆధారపడి ఉంటుంది. మొత్తంగా 60 శాతం ఓట్లు పోలవుతాయనుకుంటే.. డివిజన్‌లో 30 వేల ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీతో పాటు 51 చోట్ల ఎంఐఎం, మరికొన్ని చోట్ల వామపక్షాలు, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయం సాధించే అభ్యర్థికి దక్కే ఓట్లు పది వేల లోపే. అంటే వందల మెజారిటీతోనే గెలిచే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నోటాకు ఓట్లు పోలైతే ఫలితం తారుమారు అయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో... 

ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 15 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 118 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు.  

రాష్ట్రంలో సీపీఐ, తెలంగాణ జనసమితికి వచ్చిన ఓట్లను కలిపినా నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువే. మూడు చోట్ల పోటీ చేసిన సీపీఐకి 8,3215 ఓట్లు (0.4 శాతం) రాగా, నాలుగు చోట్ల పోటీ చేసిన తెలంగాణ జనసమితికి 9,5364 ఓట్లు (0.5శాతం) వచ్చాయి. 

వర్ధన్నపేట నియోకవర్గంలో అత్యధికంగా 5,864 ఓట్లు నోటాకు వచ్చాయి. 

మంత్రి కేటీఆర్‌ పోటీ చేసిన సిరిసిల్లలో అసలు నోటాకు ఓటే పడలేదు.  

అంబర్‌పేట నియోజకవర్గంలో నోటాకు 1,462 ఓట్లు పడ్డాయి. ఇక్కడ విజయం సాధించిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 1,016. అంటే నోటాకు పడిన ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో విజయం సాధించినట్లు లెక్క.  

2014 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి తన ప్రత్యర్థిపై కేవలం 78 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో నోటాకు 1,139 ఓట్లు పడ్డాయి. ఈ ఓట్లలో కొన్నేనా ప్రత్యర్థికి పడి ఉంటే ఫలితం తారుమారయ్యేది.


హేమాహేమీలకూ ఎఫెక్ట్‌ 

కీలక అభ్యర్థుల విషయంలోనూ సాధారణ ఓటర్లు తమ పవర్‌ను వినియోగించుకోవడం, నోటా ఓట్లు కూడా రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మార్చే ప్రమాదాన్నీ  నేతలు గ్రహించారు. 2014లో కల్వకుర్తి, భద్రాచలం, చేవెళ్ల, జహీరాబాద్‌, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో  గెలిచిన అభ్యర్థులకు ఆశ్చర్యం, ఓటమి చెందిన వారికి  విచారం కలిగించింది నోటా ఓట్లే. ఆయా స్థానాల్లో గెలిచిన అభ్యర్థి మెజారిటీ కంటే నోటా ఓట్లు ఎక్కువగా ఉంటటంతో పోటీ చేసిన నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రత్యర్థిపై కేవలం 1,696 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ నోటాకు 2007ఓట్లు పడ్డాయి. 

ఓటిచ్చేటప్పుడే ఉండాలె బుద్ధి అన్నారు కాళోజీ.. ఓటుకు మన జీవితాల్ని సమూలంగా ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. అలాంటి ఓటును విచక్షణతో వినియోగించాలి. 2014 ముందు వరకూ మనకు నచ్చినా, నచ్చకపోయాని ఎవరో ఒకరికి ఓటు వేయాల్సిన పరిస్థితి... అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో 2014లో నోటా అమలులోకి వచ్చింది. నాటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60 లక్షల నోటా ఓట్లు పడ్డాయి. 

నోటా అంటే.. 

నన్‌ ఆఫ్‌ ఎబో(నోటా) అంటే ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థీ తనకు నచ్చలేదు అని చెప్పడం. నోటా లక్ష్యం పూర్తిస్థాయిలో కాకున్నా, కొంత వరకు నెరవేరినట్లే. ఈ ఓట్లు కొందరు నేతల భవిష్యత్‌ను తలకిందులు చేస్తోంది. గెలుపు అంచుల వరకు వచ్చిన అభ్యర్థుల విజయాలను శాసిస్తోంది. ఓటమి అంచులకు చేరిన అభ్యర్థులు నోటా కారణంగా విజయతీరాన్ని అందుకోవచ్చు. అదీ నోటా పవర్‌.

Updated Date - 2020-12-01T07:21:02+05:30 IST