ఇలాగైతే ప్రమాదమే.. కరోనా కట్టడి కష్టమే..!

ABN , First Publish Date - 2020-04-05T16:19:11+05:30 IST

భౌతిక దూరం పాటించాలని వైద్యుల నుంచి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వరకు ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలూ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నాయి.

ఇలాగైతే ప్రమాదమే.. కరోనా కట్టడి కష్టమే..!

రేషన్‌ దుకాణాల వద్ద కనిపించని భౌతిక దూరం

గుంపులు గుంపులుగా ఉంటున్న ప్రజలు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): భౌతిక దూరం పాటించాలని వైద్యుల నుంచి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వరకు ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలూ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నాయి. అయినా ప్రజలకు చెవికెక్కడం లేదు. పొంచి ఉన్న ము ప్పును గ్రహించలేక పోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతున్నాయి. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా.. నిత్యావసర సరుకులు, అత్యవ సరాల కోసం సడలించిన ఆంక్షలను సాకుగా చూపుతూ యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. ఇక సహాయక చర్యలు, పర్యవేక్షణ పేరిట కొందరు ప్రజాప్రతినిధులు చేస్తోన్న హంగామా కూడా విమర్శలకు దారి తీస్తోంది. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఎక్కడున్నారు..? ఇలాంటి సమయంలోనే ప్రజలను కాపాడుకునేందుకు బయటకు రావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కొందరు భౌతిక దూరం పాటించకపోవడం కూడా ఆందోళనకరంగా మారుతోంది. క్రిమి సంహారం కోసం జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేస్తోన్న సోడి యం హైపో క్లోరైట్‌ పిచికారి పర్యవేక్షించే క్రమంలో పదుల సంఖ్యలో అనుచరులతో కలిసి వెళ్తున్నారు. సిబ్బంది దగ్గర పరికరాలు తీసుకొని తాము పని చేస్తున్నట్టు ఫొటోలకు ఫోజులిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తే ఫొటోలో కనిపించమన్న ఉద్దేశ్యంతో ప్రజాప్రతినిధులు, అనుచరులు, సిబ్బంది వరుసగా నిలబడుతున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి విస్తరిస్తోన్న సమయంలో ఈ తర హా చర్యలు శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించడం వరకు ఓకే కానీ.. ఇలాంటి సమయంలో ఫొటోలకు ఫోజులివ్వడమేంటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


సాయం చేసే చోటా.. అదే పరిస్థితి.. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సకలం స్తంభించింది. పనులు లేవు, ఆదాయం లేదు. దీంతో దినసరి కూలీలు, నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో పలు సంస్థలు, వ్యక్తులు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొందరు అన్నార్థులకు భోజనం అందిస్తుంటే.. ఇంకొందరు బియ్యం, కూరగయలు, తదితర నిత్యాసవరాలు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఓ సంస్థ ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందజేసింది. విషయం తెలియడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బియ్యం దొరుకుతాయో.. లేదో అన్న ఆందోళనతో ఎగబడ్డారు. కనీసం అడుగు దూరం కూడా లేకుండా క్యూలో పక్కపక్కనే నిలబడ్డారు. ఇలాంటివి నగరంలో చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సామాజిక బాధ్యతగా కొన్ని సంస్థలు సాయం చేసేందుకు ముందుకు వస్తుంటే.. క్రమశిక్షణ లేకుండా కొందరు పౌరులు ఎగబడుతున్నారు. ఆయా సంస్థల ప్రతినిధులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంటుంది. స్వీయ క్రమశిక్షణ ద్వారానే కరోనా మహమ్మారిని తరిమి కొట్టవచ్చని చెబుతున్నా.. సంత, సామాజిక కార్యక్రమాల వద్ద జన సమూహాలు కనిపిస్తూనే ఉన్నాయి. 


రేషన్‌ షాపుల వద్ద కనిపించని క్యూ

నగరంలోని రేషన్‌ షాపుల వద్ద రోజుకు వంద మందికి మాత్రమే బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు ఇటీవల ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేషన్‌ షాపుల వద్ద క్యూలైన్లను ఏర్పాటు చేసి భౌతికదూరం పాటించి వరుస క్రమంలో సరుకులు అందజేయాలని స్పష్టం చేసినా శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగా ఎగబడ్డారు. రేషన్‌ షాపుల వద్ద డీలర్లు, అంగన్‌వాడీ టీచర్లు సమన్వయంతో పనులు పంచుకుని లబ్ధిదారులకు ఇబ్బందులు తలేత్తకుండా చూడాలి. అంగన్‌వాడీ టీచర్లకు కేటాయించిన రేషన్‌ షాపు ఒక ప్రాంతంలో, వార్డు ఉండేది మరొక ప్రాంతంలో కావడంతో రవాణా సౌకర్యాలు లేక అంగన్‌వాడీ టీచర్లు పలు ప్రాంతాల్లో రేషన్‌ దుకాణాలకు రాలేదు. మల్కాజిగిరిలోని న్యూ మిర్జాలగూడలోని రేషన్‌షాపునకు బాలా జీనగర్‌లో ఉండే అంగన్‌వాడీ టీచర్‌ను కేటాయించారు. రవాణా సౌకర్యాలు లేక ఉదయాన్నే రాలేకపోయింది. దీంతో అప్పటి వరకు రేషన్‌ నిలిపివేశారు. ప్రజలు ఒత్తిడి తేవడంతో డీలర్‌ బియ్యం పంపిణీ చేశారు. ఈ విధమైన పరిస్థితి పలు ప్రాంతాల్లో తలేత్తింది.


బస్తీవాసుల్లో కొరవడిన అవగాహన

కరోనా వైర్‌సను అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడమే ప్రధాన మని ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా రాజకీయ నాయకులు, ప్రజలు విస్మరిస్తున్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ జరిగే ప్రాంతాల్లో గుంపుగుంపులుగా ఉండడం కలవరానికి గురిచేస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ నిబంధనలకు లోబడి చేయాల్సి ఉంటుంది. కానీ నాయకులు ప్రచార ఆర్భాటం కోసం నడిరోడ్డు మీద సరుకులు పెట్టి పంపిణీ చేస్తుండడంతో ప్రజలు తమ వంతు వచ్చే వరకు ఉంటాయో లేదోనని గుంపులు గుంపులుగా వస్తున్నారు. పంపిణీ కేంద్రాల్లో వందల సంఖ్యలో బస్తీ వాసులు వస్తుండడంతో పోలీసులు, వైద్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల క్రితం ఫిలింనగర్‌ మురికివాడల్లో ఇలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, సీపీఐ, రెండు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు వివిధ బస్తీల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన బస్తీ వాసులు వాటిని తీసుకునేందుకు భారీగా రోడ్డు మీదకు వచ్చారు. సరుకుల కోసం తోపులాటలు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి బస్తీ వాసులను చెద ర గొట్టారు. రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరుకులు పంపిణీ చేయాలనుకునే వారు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భౌతిక దూరం పాటిస్తూ అందించాలని సూచించారు. 


కూపన్ల పంపిణీలో 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డు లేకున్నా ఆధార్‌కార్డు ఆధారంగా ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించింన విషయం విధితమే. బియ్యం కావాల్సిన వారికి కూపన్ల పంపిణీ కార్యక్రమం అధికారులు చేపట్టారు. కూపన్లు ఇస్తున్నామని ముందుగానే వలస కార్మికులకు తెలియజేయడంతో గుంపులుగుంపులు కూపన్లు ఇచ్చే కేంద్రానికి తరలివచ్చారు. హిమాయత్‌నగర్‌ మండల పరిధిలోని కవాడిగూడ బండమైసమ్మనగర్‌ కమ్యూనిటీహాల్‌లో రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు. వలస కార్మికులు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరి సెంటర్‌ వద్ద బియ్యం కూపన్లను తీసుకున్నారు. దాదాపు 250 మంది వలస కార్మికులు ఈ కూపన్లతో పాటు బియ్యం కూడా ఇంటికి తీసుకెళ్లారు. రేషన్‌ బియ్యం పంపిణీ తమకు అందడం లేదంటూ వలస కార్మికులు ఆరోపిస్తున్నారు. బియ్యం కోసం గంటల తరబడి రోడ్లమీద ఎండలో ఉన్నప్పటికీ బియ్యం అందడం లేదని ఆవేధనవ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్‌రోడ్డు నెంబరు 12 ఎన్‌బీటీనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో కార్మికులు రేషన్‌ బియ్యం కోసం రెండు రోజులుగా ఎదురు చూస్తున్నారు. గురువారం ఉదయం బియ్యం పంపిణీ మొదలైంది. కానీ కొంత మంది అనర్హులను మాత్రమే రెవెన్యూ అధికారులు ప్రకటించి వారికి బియ్యం అందించలేదు. ఓ కుటుంబంలో భార్య ఆధార్‌కార్డు తెలంగాణలో భర్త అధార్‌కార్డు మరో రాష్ట్రానికి ఉంటే రేషన్‌ బియ్యం ఇవ్వొద్ద అన్ననిబంధన ఉంది. ఈ విషయంపై అవగాహనలేని వారు బియ్యం కోసం గంటల తరబడి ఎదురు చూసి ఊసురుమంటూ తిరుగుప్రయాణం అయ్యారు. 


సర్వర్‌ డౌన్‌

ఉచిత బియ్యం తీసుకునేందుకు ప్రజలు రేషన్‌ డీలర్ల వద్ద బారులు తీరుతున్నారు. భౌతిక దూరం అనే అంశాన్నే మర్చిపోతున్నారు. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో సర్వర్‌ డౌన్‌ కావడంతో బియ్యం పంపిణీలో ఆలస్యం చోటుచేసుకుంటుంది. గంటల తరబడి రోడ్ల మీద ప్రజలు గుంపులు గుంపులుగా ఉండడంవల్ల వైరస్‌ విస్తరణ వేగం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ బస్తీ వాసుల్లో అవగాహనలేక రోడ్ల మీదకు వస్తుండడం ఇబ్బందికలిగించే అంశం. 


పట్టింపులేని ప్రజాప్రతినిధులు..

కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులెవ్వరూ రేషన్‌ షాపుల వైపు రావడం లేదు. రేషన్‌ షాపుల వద్ద బియ్యం తీసుకోవడానికి వచ్చే ప్రజలను నియంత్రించే ప్రయత్నాలు చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో కొందరు రేషన్‌ దుకాణాల్లో టోకెన్లను నొక్కేసి బంధువులకు, అనుయులకు పంచుకున్నారు. టోకెన్ల కోసం ఉదయాన్నే వచ్చిన వారిలో కొంతమందికి మాత్రమే డీలర్లు జారీ చేసి అయిపోయాయని చెప్పేశారు. కానీ లైన్‌లో నిల బడేవారంతా ప్రజా ప్రతినిధుల నుంచి టోకెన్లను తెచ్చుకుని నిలబడడం విశేషం. రెండు రోజుల నుంచి టోకెన్‌ కోసం తిరిగినా దొరకడం లేదని, కొంతమందికి మాత్రం అలా వచ్చి ఇలా బియ్యం తీసుకుంటున్నారని పలువురు వాపోయారు. విపత్తు వేళ వీధుల్లోకి వచ్చి ప్రజల కష్టాలను పంచుకోవాలని  సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చినా కూడా ప్రజాప్రతినిధులు ఇళ్లకే పరిమితమయ్యారు. రేషన్‌ లబ్ధిదారులు బియ్యం కోసం ఆగచాట్లు పడ్డారు. రోడ్లపై పలు స్వచ్ఛంద సంస్థలు, అపార్‌మెంట్‌ వాసులు అందజేస్తున్న ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఎగబడుతుండడంతో ఎవరి నుంచి ఎవరికి వైరస్‌ అంటుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2020-04-05T16:19:11+05:30 IST